ప్రజావాణి ఆదుకుంటోంది..
ABN , Publish Date - Feb 07 , 2024 | 05:17 AM
ఆరోగ్య సమస్యలతో ప్రజావాణిని ఆశ్రయించిన వారికి తక్షణ సాయం లభిస్తోంది.
ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి తక్షణ సాయం
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న యువతికి 3 నెలలకు సరిపడా మందులు
బేగంపేట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలతో ప్రజావాణిని ఆశ్రయించిన వారికి తక్షణ సాయం లభిస్తోంది. అర్జీదారులకు అవసరమైన సాయం చేసేందుకు ప్రజావాణి అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌కు చెందిన దివ్యశ్రీ అనే యువతికి 2017లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. వైద్యుల సూచనల మేరకు నాటి నుంచి ఆమె మందులు వాడుతుండగా నెలకు రూ.12 వేలు ఖర్చు అవుతోంది. జీవితాంతం ఆమె ఈ మందులను వాడాలి. దీంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల పడుతున్న దివ్యశ్రీ సాయం కోరుతూ ఫిబ్రవరి 2న ప్రజావాణిని ఆశ్రయించింది. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ను కలిసి తన సమస్యను చెప్పుకుంది. దీంతో దివ్యశ్రీకి ప్రతి నెలా ఉచితంగా మందులు పంపిణీ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా దివ్యశ్రీని రెండ్రోజుల క్రితం ప్రజాభవన్‌లోని ఆరోగ్య కేంద్రానికి పిలిచిన అధికారులు తొలుత ఆమెకు ఆరోగ్య శ్రీ కార్డు జారీ చేశారు. మూడు నెలలకు సరిపడా సుమారు రూ.38 వేలు విలువైన మందులు ఉచితంగా అందజేశారు. ఇక, తమ నాలుగు నెలల చిన్నారి గుండెలో రంధ్రం ఉందని హైదరాబాద్ జియాగూడకు చెందిన సునీత సాయం కోరుతూ జనవరి 30న ప్రజావాణిని ఆశ్రయించారు. దీంతో స్పందించిన అధికారులు ఆ చిన్నారిని నగరంలోని స్టార్ ఆస్పత్రికి పంపించి ఆరోగ్యశ్రీలో ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లో ఈ శస్త్ర చికిత్స జరగనుంది.
ప్రజావాణికి 2,192 అర్జీలు
ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి వేర్వేరు సమస్యలపై 2,192 అర్జీలు వచ్చాయి 2017లో టిఎ్‌సపీఎస్సీ ద్వారా 3,300 స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు నోటిపికేషన్ వెలువడగా 2,400 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, మిగిలిన 800 మందికి ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ప్యాకర్స్ ఆండ్ మూవర్స్ వాహనాలను హైదరాబాద్ నగరంలో పగలు అనుమతించకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని ఎల్బీనగర్ ప్యాకర్స్ అసోసియేషన్ వారు ప్రజావాణిలో వినతి పత్రం ఇచ్చారు. పోలీసులు రూ.4 వేల దాకా చలానాలు వేస్తున్నారని, ఒక్క రోజులో మూడు కమిషనరేట్ల పరిధిలో చలానాలు వేస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిలో 35 ఏళ్ల క్రితం 50 ఎకరాల తమ భూమి పోయిందని, ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని, పరిహారం దక్కేలా చర్యల తీసుకోవాలని ఖమ్మం జిల్లా కారెపల్లికి చెందిన సుందర్‌లాల్ లోథ్ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు.
మూడు కొత్త కౌంటర్లు
ప్రజావాణి ప్రక్రియను సులభతరం చేసేందుకు అఽధికారులు మూడు కొత్త కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రజావాణి ప్రారంభమైన నాటి నుంచి సుమారు 12 టేబుళ్లలో సిబ్బంది అర్జీలను తీసుకుంటున్నారు. వాటికి అదనంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ల కౌంటర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఉపాధి మరియు శిక్షణకు చెందిన కౌంటర్లు ప్రత్యేకంగా పెట్టారు.