ఇంజక్షన్ వికటించి గర్భిణి మృతి
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:06 PM
ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి గర్భిణి మృతి చెందింది.
- ప్రైవేట్ ఆసుపత్రి ముందు
మృతురాలి బంధువులు ఆందోళన
నాగర్‌కర్నూల్ క్రైం, జూన్ 2 : ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకున్నది. బాధితు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల పద్మ (33) కాన్పు కోసం నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రియాంక ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడం తో కడుపులో ఉన్న పాపతోపాటు పద్మ మృతి చెందింది. ఈ సంఘటనపై తమకు న్యా యం చేయాలంటూ మృతురాలి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. స్థానిక పోలీసులు సూచనల మేరకు రాస్తారోకో విరమింపజేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఆసుపత్రిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పద్మ బంధువులు ఆందోళన చేస్తుండగా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యు లు, వైద్య సిబ్బంది ఒక్కొక్కరుగా ఆసుపత్రి వెనుక డోరు నుంచి పరార య్యారు. ఈ సంఘటనపై బాధిత మహిళా బంధువులు, ప్రజా సంఘాల నాయకులు ఆసుపత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రి సీజ్
జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్, ఉప వైద్యాధికారి వెంకటదాస్, నాగర్‌కర్నూల్ ఎస్‌ఐ గోవర్ధన్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హమీద్‌ఆలీల ఆధ్వర్యంలో ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో ఒక రోగి తప్ప వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చికిత్స పొందుతున్న ఒక మహిళ రోగిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారి తరలించారు. ఆ మహిళకు వైద్య ఖర్చులు, మందులన్ని తానే భరిస్తానని వారికి నచ్చజెప్పి తన పర్యవేక్షణలో ఒక వైద్యాధికారిని నియమించి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన భరోసా ఇచ్చారు. ప్రియాంక ఆసుపత్రిని పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.