ప్రియాంక గాంధీ.. మీరైనా మాటపై నిలబడతారా..?
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:15 AM
తెలంగాణ ఉత్తర దిక్కులోని ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్
తెలంగాణ ఉత్తర దిక్కులోని ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమన్నారు. ‘ప్రజా సమస్యలపై ఇక్కడి నేతలకు పట్టింపులేదు.. మీరైనా ఇచ్చిన మాటమీద నిలబడతారా? లేదంటే కాంగ్రెస్ నైజమే ఇదని మాట తప్పుతారా?’ అంటూ ప్రియాంక గాంధీని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక చొరవ తీసుకొని బాధితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదేశించాలని ఆమెను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని హరీశ్ నివాసంలో ఆయనను ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ తమ బాధను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకునే వరకు బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మునిసిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మధ్య నుంచి రోడ్డు వెళ్లడంవల్ల మునిసిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతుందని, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.