అయ్యో.. దేవుడా!
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:06 AM
ఉమ్మడి జిల్లాలో సోమవారం రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. చేవెళ్లలో రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న రైతులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది.
ఉమ్మడి జిల్లాలో మృత్యుఘోష
చేవెళ్ల, వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు
రెండు చోట్ల ఆరుగురు దుర్మరణం
విషాదంలో ఆలూరు, నాన్‌చెరు గ్రామాలు
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య
అక్కని నరికి చంపిన తమ్ముడు
మేడ్చల్ జిల్లా నారాయణ కళాశాలలో
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో సోమవారం రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. చేవెళ్లలో రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న రైతులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు వదిలారు. వికారాబాద్ పట్టణంలో బైక్, బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో బొలేరో వాహనం ముందు ఉన్న బైక్‌పై తిరగబడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నంలో కులాంతర వివాహం చేసుకుందని అక్కపై కోపం పెంచుకున్న తమ్ముడు వేట కొడవలితో నరికి చంపాడు. అలాగే మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో మూత్రానికి, నీరు తాగేందుకు బయటకు పంపించకుండా వేధింపులకు గురిచేశారు. దీన్ని భరించలేని ఇంటర్ విద్యార్థి బెడ్‌షీట్‌తో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రంగారెడ్డి అర్బన్/ చేవెళ్ల/ ఇబ్రహీంపట్నం/ వికారాబాద్/ఘట్‌కేసర్ రూరల్ , డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వస్తే.. లారీ రూపంలో ముగ్గురు రైతులతో పాటు కూరగాయలు కొనుక్కునేందుకు వచ్చిన ఒకరిని మాయదారి లారీ.. మృత్యువు రూపంలో ప్రాణాలను కబళించింది. చేవెళ్ల మండలం ఆలూరు గేట్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర సంచలనం రేపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రైతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో వ్యక్తిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపపత్రికి తరలించారు. విషమ స్థితిలో ఉన్న అతడికి సీపీఆర్ నిర్వహించి బతికించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు అతన్ని కూడా మృత్యువు కాటేసింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త, ఓవర్ టేక్ చేయడంతో ప్రమాదం జరిగిందని ఘటన స్థలంలో చూసిన వ్యక్తులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ కేబిన్‌లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో కేబిన్‌ను తొలగించి ప్రాణాలతో బయటకు తీశారు. డ్రైవర్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆలూరు గ్రామంతో పాటు నాన్‌చెరులో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ఆలూరు గ్రామానికి మొగులయ్య, ఆకుల పద్మమ్మ, నాన్‌చెరు గ్రామానికి చెందిన బాలమణి, మాలయాద్రి గాయపడ్డారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, చేవెళ్ల ఇన్‌చార్జి భీంభారత్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు సత్యనారాయణరెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డి, దేశమొళ్ల ఆంజనేయులు, ఆర్డీవో చంద్రకళ, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కిషన్, తహసీల్దారు కృష్ణ, సీఎం భూపాల్ శ్రీధర్, తదితరులు పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కూరగాయలు పోసి వెళ్లే సమయంలో..
మృతుడు ఆలూరు గ్రామానికి చెందిన దామరగిద్ద కృష్ణ (22) డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష కూడా రాశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆ యువకుడు తల్లిదండ్రులు జంగయ్య, యాదమ్మకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆలూరు గేటు వద్ద కూరగాయాలు వేసి తిరుగు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే లారీ ఆ యువకుడిని మృత్యురూపంలో కబళించింది.
అక్కను నరికి హతమార్చిన తమ్ముడు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి రాయపోల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని అక్కను తమ్ముడు వేట కొడవలితో నరికి హతమార్చాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణికి ఎనిమిదేళ్ల క్రితం ఇబ్రహీం పట్నం మండలం ఎంపీ పటేల్‌గూడకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. ఇటీవల అతనితో విడాకులు తీసుకుంది. అయితే నాగమణి, రాయపోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ పెళ్లికాకముందు నుంచే ప్రేమించుకుంటున్నారు. నాగమణి విడాకులు అయిన తర్వాత గత నెల 10న వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిది కులాంతర వివాహం కావడంతో నాగమణి సోదరుడు పరమేష్ తట్టుకోలేకపోయాడు. నాగమణి, శ్రీకాంత్ ఆదివారం రాయపోల్‌కు వచ్చారు. సోమవారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టాడు. కిందపడగానే వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మెడపై నరికి చంపాడు. అయితే ఇది పరువు హత్య కాదు.. ఆస్తి తగాదా కారణమని స్థానికులు చెబుతున్నారు.
కారు, బొలేరో ఢీ.. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతి
వికారాబాద్ పట్టణం రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన రవీందర్(45) మెడికల్ కళాశాలలో కాంట్రాక్టర్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్(25) అనంతగిరిలోని ఆయూష్ ఆసుపత్రి నిర్మాణం భవనంలో ఎలక్ర్టిషన్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి రేషన్ సరుకుల కోసం వికారాబాద్‌కు ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో మద్యం లోడుతో వెళుతున్న బొలేరో వాహనం, కారు ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో బైక్‌పై బొలేరో వాహనం ఎగిరిపడింది. దీంతో బైక్‌పై ఉన్న రవీందర్, హేమంత్ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. రవీందర్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉండగా హేమంత్ భార్య ఉంది. బొలేరేలో ఉన్న మద్యం బాక్సులు పూర్తిగా కిందపడిపోయాయి. ఒక వైపు ప్రమాదంలో ప్రాణాలు పొతుంటే జనం మాత్రం మద్యం ఎత్తుకెళ్లేందుకు ఉత్సాహం చూపించారు. కొందరూ స్థానికులు వచ్చి మద్యం సీసాలను మరో వాహనంలో ఎక్కించడం కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమ్ కుమార్ తెలిపారు.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం, పెద్దపలుగు తండాకు చెందిన బానోత్ జగన్నాథం నగరంలోని కుషాయిగూడ చక్రీపురంలో ఉంటున్నాడు. ఆయన చిన్న కుమారుడు బానోత్ తనుష్ నాయక్(16) అలియాస్ టింకు అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంట లకు విద్యార్థులను టీ బ్రేక్‌కు వదలడంతో టీ తాగి తిరిగి తరగతి గదులకు వెళ్తుండగా తనుష్ కనిపించ లేదు. దీంతో తోటి విద్యార్థులు వెతకడంతో బాత్‌రూంలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అధ్యాపకులకు తెలిపారు. దీంతో కళాశాల యాజమా న్యం హుటాహుటిన చిక్సిత నిమిత్తం ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే తనుష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి ఎలా తరలిస్తారని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కళాశాల గేట్లు తన్నుకొని లోపలికి వెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో గేటు ఎదుట బైఠాయించి కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుడి బంధువు ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకోని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడకు విద్యార్థి సంఘాలు చేరుకొని కళాశాల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వేధింపుల కారణంగానే తనుష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదే లేదని బైఠాయించారు.