ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:43 AM
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజలు వివిధ సమస్యలతో బాలురు తీరారు. కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదులు అందజేసి విన్నవించారు. మొత్తం 92 మంది వివిధ శాఖలకు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రజలు వివిధ సమస్యలతో బాలురు తీరారు. కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదులు అందజేసి విన్నవించారు. మొత్తం 92 మంది వివిధ శాఖలకు ఫిర్యాదు చేశారు. అందులో రెవెన్యూశాఖ 57, హౌజింగ్ 19, పంచాయతీ 7, లోకల్ బాడీస్ 3, ఎంపీడీవో, వైద్యశాఖకు ఒక్కోటి, ఇతర ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
హైటెన్షన్ లైన్‌ను ఏర్పాటు చేయొద్దు
కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో సాగు చేసుకుంటున్న పంట పొలాల మీదుగా విద్యుత్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేయకుండా చూడాలని గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణలు కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. బీదర్ నుంచి మహేశ్వరం వరకు పవర్ గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ విద్యుత్ లైన్‌ను పంట పొలాల మీదుగా ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని నాయకులు కలెక్టర్‌కు వివరించారు. పోల్ సర్వే మార్కింగ్‌ను నిలిపివేయించాలని కోరారు. విద్యుత్ లైన్ ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టర్ రైతులకు, పట్టాదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లైన్ ఏర్పాటు చేశారని, పవర్‌గ్రిడ్ అధికారులతో మాట్లాడి రైతులకు మేలు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు జీఎల్‌ఎన్ రెడ్డి, రామకృష్ణలు తెలిపారు. నాయకులు ఎగిరిశెట్టి గాందీ, పెంటారెడ్డి, జంగయ్య, నర్సింహ, జంగారెడ్డి, బోసు రవి, అభిషేక్‌రెడ్డి, శివరాజ్, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.