Share News

చలి పంజా

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:58 PM

ఉమ్మడి జిల్లాలో చలి ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సీజన్‌లో 12.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

చలి పంజా

గజగజ వణుకుతున్న జనం

రాత్రి వేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడిజిల్లాలో 12.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో చలి ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సీజన్‌లో 12.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగి పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి, రంగారెడ్డిజిల్లా చందన్వెల్లిలో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే వికారాబాద్‌ జిల్లా మన్నెగూడలో 12.2 డిగ్రీలు, కోట్‌పల్లిలో 12.4, వికారాబాద్‌లో 12.7డిగ్రీల, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 12.2 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్‌లలో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో 13.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌, శామీర్‌పేటలో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగటిపూట ఎండలు బాగానే ఉంటున్నప్పటికీ సాయంత్రం తరువాత చలి తీవ్రత పెరుగుతోంది. చలి పంజా విసురుతుండంతో రాత్రి వేళల్లో బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలిని తట్టుకునేందుకు స్వెటర్‌లు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో జ్వరం, జలుబు, దగ్గున బారిపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Updated Date - Nov 18 , 2024 | 11:58 PM