ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలి
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:56 PM
వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్‌ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్‌డీ ఏఎన్‌ఎంలను రాత పరీక్ష లేకుండా యథావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
20 ఏళ్లుగా అవుట్‌సోర్సింగ్‌లో సేవలు
రాత పరీక్ష లేకుండా క్రమద్ధీకరించాలి
29న నిర్వహించే పరీక్షను రద్దు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోవాలి
డిమాండ్ల సాధనకు పోరుబాట
‘మేము అధికారంలోకి వచ్చాక మీ సమస్యలను పరిష్కరిస్తాం. ఈ ప్రభుత్వం త్వరలో పోతుంది. (బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి) మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అధికారంలోకి వచ్చాక మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మీరు బాధపడకండి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మిమల్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత మాదే’ - తాండూరులో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మాటలు
తాండూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్‌ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్‌డీ ఏఎన్‌ఎంలను రాత పరీక్ష లేకుండా యథావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం 19వ తేదీ నుంచి పోరుబాట పట్టారు. ఇందుకోసం 29న నిర్వహించనున్న ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) రాత పరీక్షను నిలిపి వేయాలని వైద్యారోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. 20 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. వీరంతా 46 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారని, వారు పోటీ పరీక్ష రాసే పరిస్థితి లేనందున రాత పరీక్ష లేకుండా సర్వీసులను క్రమబద్ధీకరించాలని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసి న్యాయం చేయలని ఏఎన్‌ఎంలు, సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
సమస్యల పరిష్కారంపై ఆశాభావం
టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి 2023 ఆగస్టు 24న ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణానికి వచ్చారు. అప్పటికి సమ్మెలో ఉన్న ఏఎన్‌ఎంలు కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వద్దకు వచ్చి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రేవంత్‌రెడ్డికి అందజేస్తూ తమను అదుకుంటే పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. తప్పకుండా అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని , ఎన్‌ఎంల డిమాండ్లు పరిష్కరిస్తామని, రెగ్యులైజేషన్ చేస్తామని ప్రతిపక్ష నేతగా హమీ ఇచ్చిన విషయాన్ని ఏఎన్‌ఎంలు నేడు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సీఎం అయినందున తమ డిమాండ్లు నెరవేరుతాయని ఏఎన్‌ఎంలు ఆశిస్తున్నారు.