Share News

మత కల్లోలాల సృష్టికే ఆలయాలపై దాడులు

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:32 PM

రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

మత కల్లోలాల సృష్టికే ఆలయాలపై దాడులు
శివలింగాన్ని ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేందుకే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇటీవల ఫరూఖ్‌నగర్‌ మండలం జానంపేటలోని బవసవేశ్వరాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన గుడిని ఆమె శనివారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను అరికట్టేందుకు ఆలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో నూతనంగా నిర్మించిన హనుమాన్‌ దేవాలయాన్ని డీకే అరుణ సందర్శించారు. చౌదరిగూడ మండలం ఎంకిర్యాల సంజీవపురం వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక మాస సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించాలని కోరుతూ పట్టణ ప్రజలు షాద్‌నగర్‌ చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, బీజేపీ నేతలు మోహన్‌సింగ్‌, ప్రదీప్‌, నర్సింహులు, మురళీ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:32 PM