Share News

ధ్యాన సంద్రం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:04 AM

కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన సంద్రంగా మారింది. పత్రిజీ ధ్యాన మహాయాగం-3 వేడుకలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ధ్యాన సంద్రం
ధ్యాన వేడుకల్లో పాల్గొన్న ధ్యానులు

అట్టహాసంగా ధ్యాన మహాయాగం వేడుకలు ప్రారంభం

మహేశ్వర మహాపిరమిడ్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభ్యాసకులు

పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌ రెడ్డితో కలిసి వేడుకలను ప్రారంభించిన ఎంపీ మల్లు రవి

హాజరైన కర్నూల్‌ ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఆకట్టుకున్న ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు

అలరించిన కళాకారుల నృత్య రూపకాలు

పత్రీజీ చైతన్య జ్యోతి ర్యాలీకి ఘన స్వాగతం

కడ్తాల్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన సంద్రంగా మారింది. పత్రిజీ ధ్యాన మహాయాగం-3 వేడుకలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 11రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయాగం వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు పెద్ద సంఖ్యలో అభ్యాసకులు, సాధకులు, సందర్శకులు, పిరమిడ్‌ మాస్టర్లు, మహిళలు తరలివచ్చి సరస్వతి ప్రాంగణంలో ధ్యానం చేశారు. పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయ భాస్కర్‌ రెడ్డి, పత్రిజీ కూతుళ్లు పరిణత పత్రిజీ, పరిమళ పత్రిజీలతో కలిసి నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి వేడుకలను ప్రారంభించారు. కర్నూల్‌ ఎంపీ బస్తిపాటి నాగరాజు, మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్థన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పత్రీజీ జయంతిని పురస్కరించుకొని నవంబరు11న ప్రారంభమైన పత్రీజీ చైతన్య జ్యోతి ర్యాలీ పిరమిడ్‌లోని పత్రిజీ శక్తిస్థల్‌కు చేరుకోగా ఘనస్వాగతం పలికారు. శక్తిస్థల్‌ను ధ్యానులు, సందర్శకులు సందర్శించి ప్రతిజీకి నివాళులర్పించారు. నిర్వాహకులు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ధ్యాన దినోత్సవ వేడుకల నేపథ్యంలో పత్రిజీ కుమార్తెలు కేక్‌ కట్‌చేశారు. అనంతరం సామూహిక ధ్యాన సాధనలో లీనులయ్యారు.

భారతీయుల ధ్యాన మార్గం ప్రపంచానికే ఆదర్శనీయమని ఎంపీ మల్లు రవి అన్నారు. ధ్యానం ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. పత్రీజీ చేపట్టిన ధ్యాన, శాఖాహార జగత్తు లక్ష్యాల సంకల్పం విజయవంతానికి అభ్యాసకులు, పిరమిడ్‌ మాస్టర్లు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. మహేశ్వర మహాపిరమిడ్‌ ఏర్పాటుతో కడ్తాల ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. కర్నూల్‌ ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ధ్యానం, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేవారు ఆనందమయ జీవితాన్ని పొందుతారని అన్నారు. పత్రిజీ చూపిన ధ్యాన మార్గం ప్రపంచ మానవాళికి అనుసరణీయమని పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌ రెడ్డి అన్నారు. పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా పిరమిడ్‌ ట్రస్ట్‌ ముందుకు సాగుతుందన్నారు. 2028లో మహేశ్వర మహా పిరమిడ్‌లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీని మహాసభలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పత్రీజీ కూతుళ్లు పరిణతి, పరిమళ పత్రిజీలు మాట్లాడుతూ ప్రతీ పిరమిడ్‌ మాస్టర్‌ ఒక పత్రీజీ కావాలని, సమాజాన్ని ధ్యాన, జ్ఞాన, ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకుపోవాలన్నారు. డిసెంబరు 21వ తేదీని వరల్డ్‌ మెడిటేషన్‌ డేగా ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఆమోదించడం భారత ధ్యాన విప్లవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పత్రిజీ కృషి ఫలితమేనన్నారు. కాగా, ఎంపీలు మల్లు రవి, నాగరాజులు పత్రిజీ ఆశయం మేరకు ఏపీలోని కర్నూల్‌ జిల్లా జగన్నాఽథ గుట్టపై ధ్యాన మహాకేంద్రం ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో కృషి చేస్తామని చెప్పారు.

వేడుకలకు కిషన్‌రెడ్డికి ఆహ్వానం

ధ్యాన వేడుకలకు హాజరుకావాలని కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డిని పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయ భాస్కర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం కిషన్‌రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విజయభాస్కర్‌ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు సాంబశివరావు, దామోదర్‌ రెడ్డి, హన్మంతరావు, మాధవి, లక్ష్మి, జ్యోతి, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ యాట గీతనర్సింహ్మ, వైస్‌ చైర్మన్‌ గూడూరు భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, దశరథనాయక్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:04 AM