అటవీ భూముల ఆక్రమణకు యత్నం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:01 AM
అడవిలోని చెట్లను నరికి నిప్పుపెట్టి అటవీ భూమిని ఆక్రమించేందుకు ఆక్రమార్కుల చేసిన ప్రయత్నాన్ని అటవీ సిబ్బంది నిలువరించారు.
ధారూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): అడవిలోని చెట్లను నరికి నిప్పుపెట్టి అటవీ భూమిని ఆక్రమించేందుకు ఆక్రమార్కుల చేసిన ప్రయత్నాన్ని అటవీ సిబ్బంది నిలువరించారు. ఈ ఘటన ధారూరు అటవీ రేంజ్ పరిధిలోని రాస్నం సెక్షన్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. అటవీ రేంజర్ రాజేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన కావలి శ్రీను, కుమ్మరిపల్లి మొగులయ్యలు రాస్నం అటవీ ప్రాంతంలో అక్రమంగా చొరబడి వివిధ రకాలచెట్లను నరికివేశారు. నరికివేసిన చెట్ల ఆనవాళ్లు గుర్తుతెలియకుండా వాటికి నిప్పుపెట్టి తగుల బెట్టారు. అదే సమయంలో అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది గమనించి నిప్పును ఆర్పివేశారు. కాగా గతేడాది శ్రీను, మొగులయ్యలు అక్రమంగా ఒక ఎకరా అటవీభూమిని కబ్జా చేసి కందిపంటను సాగుచేశారని అటవీ రేంజర్ తెలిపారు. అయితే వారు తాజాగా పక్కనే ఉన్న మరో ఎకరా భూమిలో చెట్లను నరికి తగులబెట్టి కబ్జాకు ప్రయత్నించారని, ఈ మేరకు అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.