Share News

బతుకమ్మ చీరలు మూలకు!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:25 AM

2023 శాసన సభ ఎన్నికల కోడ్‌ రావడంతో గత పండుగకు బతుకమ్మ చీరల పంపిణీ నిలిచింది. ఏటా ప్రభుత్వం బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండి రేషన్‌ కార్డుల్లో పేరున్న మహిళలందరికీ కానుకగా చీరలను అందజేసేది.

బతుకమ్మ చీరలు మూలకు!
చేవెళ్ల పంచాయతీ కార్యాలయంలో కుప్పలుగా పడి ఉన్న బతుకమ్మ చీరలు

ఎన్నికల కోడ్‌తో నిలిచిన పంపిణీ

గత అక్టోబరులో ఆడపడచులకు 50శాతం అందజేత

మిగతా చీరలన్నీ పంచాయతీల్లో కుప్పలుగా దర్శనం

ఈ చీరలు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్న స్థానికులు

బతుకమ్మ చీరలపై పట్టింపు లేని డీఆర్‌డీఏ

చీరల పంపిణీ పథకంతో రూ.కోట్ల మేర ప్రజాధనం వృథా అంటున్న ప్రజలు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి అసెంబ్లీ ఎన్నికల కోడ్‌తో బ్రేక్‌ పడింది. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది. అయితే గత బతుకమ్మ పండుగ నాటికి 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో సగం మందికి చీరల పంపిణీ జరగలేదు. కార్యాలయాల్లోనే చీరలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో చీరల పంపిణీకి 7,28,000 మంది మహిళలను అర్హులుగా గుర్తించారు. వారిలో చాలా మందికి చీరలందలేదు. చీరల పంపిణీలో డీఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసినా వేగంగా చీరల పంపిణీ చేయలేదు. పౌర సరఫరాల శాఖ, రేషన్‌ డీలర్లు, సెర్ప్‌, మెప్మా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ శాఖ, మహిళా సంఘాల సహకారంతో పంపిణీ చేయాలని నిర్ణయించినా కార్యాచరణ లోపంతో చీరల పంపిణీ పూర్తి కాలేదు.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 18 : 2023 శాసన సభ ఎన్నికల కోడ్‌ రావడంతో గత పండుగకు బతుకమ్మ చీరల పంపిణీ నిలిచింది. ఏటా ప్రభుత్వం బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండి రేషన్‌ కార్డుల్లో పేరున్న మహిళలందరికీ కానుకగా చీరలను అందజేసేది. గత అక్టోబరులో చీరలను పంచాయతీలకు, మున్సిపల్‌ కార్యాలయాలకు తరలించగా.. మొదట్లో కొందరికి పంపిణీ చేశారు. అంతలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ రావడంతో చీరల పంపిణీ నిలిచింది. దీంతో పండుగకు సర్కార్‌ ఇచ్చే కానుక ఆడబిడ్డలకు అందకుండా పోయింది. జిల్లాలోని 23 మండలాలు, 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు అధికారులు చీరలు సరఫరా చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల పైచిలుకు మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందించాలని నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ముందే సమాచారమున్నా అధికారుల చీరల పంపిణీలో నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. చాలా మట్టుకు పంచాయతీ కార్యాలయాలు, రేషన్‌ షాపుల్లో బతుమ్మ చీరలను నిల్వ చేశారు. వచ్చిన వాటిల్లో సంగం పంపిణీ చేసినా మరో సగం చీరలు కుప్పలు తెప్పలుగా కార్యాలయాలు, రేషన్‌ డీలర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. ఎలుకలు, ఇతర కీటకాలకు చీరల కుప్పలు ఆవాసాలుగా మారాయి. జిల్లాలో వంద శాతం బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని డీఆర్‌డీఏ అధికారులు చెబుతుండడం గమనార్హం. మరి ఆఫీసుల్లో కుప్పలుగా పడి ఉన్న చీరలు ఎక్కడివో అధికారులే చెప్పాలి. గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ పథకాన్ని రేవంత్‌రెడ్డి కొనసాగిస్తారా? అనే అనుమానం కలుగుతోంది. మిగిలిన చీరలు ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది.

గత ప్రభుత్వం పంపిణీకి ప్రయత్నించినా ...

ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందించడంతో పాటు చేనేత వృత్తిదారులకు ఉపాధి చూపి ఆదుకోవాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ బతుకమ్మ పండుగకు చీరలు అందించేంది. 2023లో రూ.350కోట్లు కేటాయించి కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్‌ ఇచ్చింది. 2023 అక్టోబర్‌లో బతుకమ్మ ఉత్సవాల్లో పండగకు లబ్ధిదారులకు చీరలను కానుకగా ఇవ్వాలనుకుంది. అంతలోనే 2023 శాసనసభ ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఈ ఎన్నికల్లో బతుకమ్మ చీరల పంపిణీతో బీఆర్‌ఎస్‌ పార్టీకి లబ్ధి చేకూరుతుందని, ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు అనుమతిచ్చేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. మహిళలకు చీరలు పంపిణీ చేయాలన్న గత ప్రభుత్వ ప్రయత్నానికి ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. బతుకమ్మ చీల పంపిణీ పథకం పాతదే అని, ఇది యేటా జరిగే కార్యక్రమమే అని అనుమతి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది. అయినా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత చీరల పంపిణీకి అనుమతిచ్చేది లేదని కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది.

కొత్త ప్రభుత్వంలో పంపిణీకి బ్రేక్‌!

కాగా రేషన్‌ కార్డుల ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారి జాబితాను అప్పట్లో సిద్ధం చేశారు. జిల్లాలో 7,28,000 మందిని గుర్తించారు. పౌర సరఫరాల శాఖ, రేషన్‌ డీలర్లు, సెర్ప్‌, మెప్మా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ శాల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యుల సహకారంతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. కిందామీదా పడి 50 శాతం చీరలను పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్‌ పోయిన తరువాత చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బొమ్మతో ఉన్న చీరలను పంపిణీ చేయొద్దని అధికారులకు మౌఖిక ఆదేశాలు రావడంతో చీరల పంపిణీకి ఫుల్‌స్టాప్‌ పడింది. సగం పంపిణీ చేయగా మిగిలిన చీరలను వాపస్‌ చేయాలని నిర్ణయించారు. కానీ.. ఇప్పటి వరకు చీరలను వాపస్‌ చేయలేదు. లక్షల చీరలు పంపిణీ కేంద్రాల్లో ఉండి పోయాయి. కొన్ని చోట్ల చీరలను ఎలుకలు కొడుతున్నాయి. చేవెళ్ల పంచాయతీలో బతుకమ్మ చీరలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. చీరలను సర్పంచ్‌ చాంబర్‌లో ఓ మూలన ఉంచారు. తిరిగి వాపస్‌ తీసుకెళ్లాలని అధికారులకు తెలిపినా.. డీఆర్డీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఎన్ని చీరలు పంపిణీ చేశారు? ఇంకా ఎన్ని మిగిలున్నాయనే లెక్కలు కూడా అధికారుల వద్ద లేక పోవడం విచిత్రం. ఒక్కో చీరకు ప్రభుత్వం 900 రూపాయల వరకు వెచ్చించింది. అయితే తీసుకున్న వారు మాత్రం చీర 150కి మించదు అని విమర్శించారు. అది వేరే విషయం. ప్రభుత్వం అంత ఖర్చుచేసి తెచ్చిన చీరలన్నీ నిరుపయోగంగా మారడంతో మహిళలు, ప్రజలు మండి పడుతున్నారు. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్న చందంగా ప్రభుత్వాలు, అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. పంపిణీకి అని చెప్పి తెచ్చి పంచకపోవడం ఒక తప్పయితే ఎన్నికలు పూర్తయినా పంచకపోవడం, కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ బతుమ్మ చీరల పరిస్థితి ఇలాగే ఉంది. కాగా బతుకమ్మ చీరల్లో కోట్ల రూపాయల కుంభంకోణం జరిగిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని కూడా బయటకు తీయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు వందలకు మించని చీరలకు 900 ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పందించి పంపిణీ చేయగా మిగిలిన బతుకమ్మ చీరలను తిరిగి వాపస్‌ చేయాలని, లేదా తీసుకోని మహిళలకైనా పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు : అశ్విని, లక్ష్మీదేవిపల్లి, జిల్లేడు చౌదరిగూడ మండలం

బతుకమ్మ చీరల పేరిట గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దసరా పండగకు బతుకమ్మ కానుకగా కేసీర్‌ ఇచ్చిన చీర కనీసం ఒక్క మహిళైనా కట్టుకోలేదు. చీరలు బాగా లేవని ముఖం మీదే చెప్పారు. కొందరు ఉచితంగా వస్తుందని తీసుకుని వెళ్లారే తప్ప ఎవరూ కట్టుకోలేరు. తీసుకున్న చీరలను మసి గుడ్డలుగా, చేలల్లో అడవి జంతువుల నుంచి రక్షణగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు కార్లపై, బైక్‌లపై కప్పారు. గత దసరాకు చీరలు చాలా మందికి అందలేదు. పంచాయతీల్లో ఉన్న చీరలను ఏం చేస్తారు? ఇప్పుడు కంపెనీలకు వాపస్‌ ఇస్తే గవర్నమెంట్‌కు డబ్బులు వస్తాయా? వస్తే తిరిగి ఇచ్చేయండి. లేదా మహిళలకైనా పంపిణీ చేయాలి.

Updated Date - Apr 19 , 2024 | 12:43 AM