నత్తనడకన బీటీ పనులు
ABN , Publish Date - Mar 24 , 2024 | 11:56 PM
మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై కంకరవేసి బీటీ వేయకపోవడంతో పాంబండ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కులకచర్ల, మార్చి 24 : మండలంలోని బొంరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుపై కంకరవేసి బీటీ వేయకపోవడంతో పాంబండ గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాంబండ బీటీ రోడ్డు నుంచి బొంరెడ్డిపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.కోటీ రూ.20 లక్షలు నిధులు విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలకులు, అధికారులు హడావుడిగా పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ కంకరవేసి వదిలేశారు. ప్రతీనెల పౌర్ణమి రోజున పాంబండ గిరి ప్రదక్షిణ హిందు బంధువుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బొంరెడ్డిపల్లికి వెళ్లే రోడ్డు పాంబండ చుట్టూ ఉంటుంది. గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు బొంరెడ్డిపల్లికి వెళ్లేదారిలో వేసిన కంకరపై నడవాల్సిన పరిస్థితి నెలకొంది. తేలిన కంకరపై పాదరక్షలు లేకుండా నడుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బీటీ వేయాలని ప్రజలు కోరుతున్నారు.