Share News

భూదాన్‌ భూముల చెర!

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:15 PM

భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన భూదాన్‌ భూములు బడాబాబుల చేతుల్లో బందీ అయ్యాయి. కోట్లు విలువ చేసే భూములను భూబకాసురులు అనుభవిస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి ఒకరి నుంచి మరొకరికి పట్టాలు మార్చి ఏమార్చారు.

 భూదాన్‌ భూముల చెర!
నారాయణపూర్‌ శివారులోని భూదాన్‌ భూమిలో ఏర్పాటు చేసిన స్టీల్‌ ఫ్యాక్టరీ

-పరిగి మండలంలో 32 ఎకరాలు స్వాహా

-మాయమాటలతో మోసపోయిన లబ్ధిదారులు

-పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న బడాబాబులు

-న్యాయం కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

-ఈ భూముల విలువ రూ.80 కోట్లపై మాటే

భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన భూదాన్‌ భూములు బడాబాబుల చేతుల్లో బందీ అయ్యాయి. కోట్లు విలువ చేసే భూములను భూబకాసురులు అనుభవిస్తున్నారు. రికార్డులు తారుమారు చేసి ఒకరి నుంచి మరొకరికి పట్టాలు మార్చి ఏమార్చారు. అసైన్‌మెంట్‌ భూములను వారసత్వంగా అనుభవించవచ్చ. కానీ, అమ్మడానికి వీలు లేదు. అయితే ఇక్కడ నిబంధనలు విరుద్ధంగా బడాబాబుల ఆధీనంలోకి వెళ్లాయి. రికార్డులను చెరిపి ఒకరి, ఇద్దరి పేర్లపై మార్పిడి చేసి బడాబాబులు దక్కించుకున్నారు. పరిగి మండలం నారాయణపూర్‌ గ్రామంలో పేదలకు దక్కాల్సిన 32.32 ఎకరాల భూములను మాయ చేసి దక్కించుకున్నారు. దర్జాగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని లాభాలు గడిస్తున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధిత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకుండా పోయింది.

పరిగి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పరిగి మండలం నారాయణపూర్‌ గ్రామంలో సర్వేనంబర్లు 143, 144, 145లు పూర్తిగా భూదాన్‌ భూములే ఉన్నాయి. 143లో 14.15 ఎకరాలు, 144లో 13.13 ఎకరాలు, 145లో 5.04 ఎకరాల భూమి భూదాన్‌ బోర్డు భూములే. ఈ సర్వే నంబర్లలో మొత్తం 32.32 ఎకరాలు ఉంది. ఈ భూములన్ని ఖహస్రా, శేత్వార్‌ రికార్డులలో బెన్నూరు చెన్నప్ప, శంకరప్ప పేరిట వస్తుంది. 1975 తర్వాత భూదాన్‌ బోర్డు పరిధిలోనికి వెళ్లింది. అప్పట్లో 1976లో 32.32 ఎకరాల భూములను నారాయణపూర్‌ గ్రామానికి చెందిన ఏడు మంది జి.పాపన్న, రామయ్య, లాలుఆహ్మద్‌, ముసలయ్య, మాల అంతన్న, టి.రామన్న, కె.ఎల్లన్నకు భూదాన్‌ బోర్డు ద్వారా కేటాయించారు. వీరంతా గత ముప్పై ఏళ్లపాటు పంటలు సాగు చేసుకుంటూ వచ్చారు. భూదాన్‌ బోర్డు ద్వారా పేదల పంపిణీ చేసిన తర్వాత 30 ఏళ్లపాటు పేదలు పంటలు సాగు చేసుకున్నారు. ఆ తర్వాత బెదిరింపులకు గురి చేసి వారిని పొజిషన్‌ నుంచి తప్పించి ఇతరుల చేతుల్లోకి తీసుకున్నారు.

తిరిగి పట్టాలు ఇప్పించేవరకు

2005-06 వరకు భూదాన్‌ బోర్డు వారు కేటాయించిన పేర్లే రికార్డుల్లో వస్తున్నాయి. ఆ తర్వాత అప్పట్లో మొదట భూమి పట్టదారు వారసులు ఆ భూములు బాగా లేవు, మరోచోట చూపిస్తానని పొజిషన్‌లో ఉన్న రైతులను నమ్మించి వారిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. తర్వాత చెన్నప్ప, శంకరప్ప వారసులైన విజయశంకర్‌, ప్రభులింగం, సుధీర్‌లు రికార్డుల్లోకి వచ్చారు. వీరి నుంచి 32.32 ఎకరాల భూమిని జి.రామయ్య, భూదేవి, రామారావు, అమీనా, జహీరా, రాములమ్మ, నాగిరెడ్డి, నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి కొనుగోలు చేశారు. పైతొమ్మిది మంది పేర్ల మీద నుంచి 2007, 2008లలో వివిధ డాకుమెంట్ల ద్వారా 9.15 ఎకరాలు ఓ స్టీల్‌ కంపెనీ పేరిట, 23.07 ఎకరాలు ఓ మెటల్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. అప్పటి నుంచి ఈ భూదాన్‌ భూములన్నీ ఇద్దరి వ్యక్తుల ఆధీనంలోనే ఉన్నాయి. ఆ స్టీల్‌ కంపెనీలో 15 ఏళ్ల కిందటే నిర్మాణాలు చేపట్టారు. ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఉన్న భూములు సైతం వారి ఆధీనంలో ఉన్నాయి. అయితే భూముల స్థానంలో వేరేచోట చూపిస్తామని నమ్మించి మొదటి పట్టదారు వారసులు, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి సదరు పేద రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇట్టి భూములను ఆ తర్వాత కూడా భూదాన్‌ బోర్డు రెండోసారి సదరు రైతులకే ఇస్తూ పత్రాలను కూడా అందజేసింది. భూదాన్‌ బోర్డు కూడా ఈ భూములను తాము సూచించిన రైతులకు ఇప్పటించాలని రెవెన్యూ శాఖకు లేఖ రాసిందని, దాని ఆధారంగా తిరిగి పట్టాలు ఇప్పించాలని బాధిత రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

భూదాన్‌ భూములేనని తేల్చిన కూడా

బాధిత రైతులు కలెక్టర్‌, ఆపై ఉన్నతస్థాయి అధికారులు ఫిర్యాదులు చేయడంతో రెవెన్యూ అధికారులు భూములు సందర్శించి భూదాన్‌ భూములేనని తేల్చారు కూడా. రెవెన్యూ అధికారులు గతంలోనే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని కబ్జాలోకి వచ్చిన వారు శిక్షార్హులని బోర్డులను ఏర్పాటు చేయించిన సంగతి విధితమే. ఈ ఇదే భూమిలో ఓ స్టీల్‌ ఇండస్ట్రీ రన్నింగ్‌ అవుతుండగా, మరో కంపెనీ పేరిట ఆధీనంలో ఉన్నది. అయితే తాము భూములను సేల్‌డీడ్‌ ద్వారా కొనుగోలు చేశామని సదరు కంపెనీలు కోర్టు ఆశ్రయించగా, స్టే ఇచ్చింది. స్టే గడువు కూడా పూర్తయింది. భూదాన్‌ బోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సూచించిన ఇప్పటి వరకు బోర్డు అసలు ముందుకు సాగడం లేదు. ఉన్నతస్థాయిలో ఒత్తిడిల వల్లనే అధికారులు ముందుకు కదలడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాధితులు మాత్రం తమకు భూములు ఇప్పించాలి అధికారులు కోరుతున్నారు.

రూ.80 కోట్ల పైమాటే...

ఈ భూములు ఎకరా రెండు కోట్లకుపైగా పలుకుతున్నది. అయితే పేదలకు అనుభవించాల్సిన భూమి బడాబాబుల చేతుల్లో ఉంది. ఈ భూమి విలువ దాదాపుగా రూ.80 కోట్లకుపైగా ఉంటుంది. ఇదంతా కొందరు బడానేతలే పారిశ్రామిక నేతలకు వత్తాసు పలికి అప్పగించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

......................

ఏళ్లుగా పోరాడుతున్నం

భూదాన్‌ ద్వారా పట్టాలు పొందిన రైతులకు కొందరు మాయమాటలు చెప్పి పొజిషన్‌ నుంచి మమ్మల్ని తప్పించారు. ఆ తర్వాత రికార్డులు మార్చి ఇతరులకు విక్రయించారు. వీటి గురించి గత ఐదేళ్లుగా పోరాడుతున్నం. భూదాన్‌ బోర్డు నుంచి పొజిషన్‌ చూపించాలని తహసీల్దార్‌కు లేఖ పంపించే వరకు పోరాటం చేసినం. ఇంకా చేస్తున్నం. ఈ భూముల్లో కబ్జా చేసిన వారిని విడిపించే వరకు పోరాడతం.

-బందయ్య, బాధిత రైతుల సంఘం నాయకుడు, నారాయణపూర్‌

.............................................................

స్టే ఉంది, కౌంటర్‌ దాఖలు చేస్తాం

నారాయణపూర్‌లోని 143,144,145 సర్వే నంబర్లలోని 32.32 ఎకరాల భూమిపై విచారణ జరిపి భూదాన్‌ భూములుగా గతంలోనే గుర్తించారు. రికార్డులు స్వాధీనం చేసుకుని బోర్డులు కూడా గతంలో పెట్టారు. అప్పట్లో ఆయా కంపెనీల వారు స్టే తెచ్చుకున్నారు. మేము కూడా కౌంటర్‌ దాఖలు చేస్తాం. భూదాన్‌ భూములు క్రయ,విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరం. అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు పొజిషన్‌ తీసుకునేందుకు ముందుకు వెళతాం.

-ఆనంద్‌రావు, తహసీల్దార్‌, పరిగి

Updated Date - Nov 20 , 2024 | 11:15 PM