Share News

చికెన్‌ బిర్యానీలో బ్లేడ్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:52 PM

హోటళ్లలో తినే పదార్థాల్లో సహజంగా పురుగులు, బొద్దింకలు రావడం చూశాం. కానీ ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఏకంగా బిర్యానీలో బ్లేడ్‌ వచ్చింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

చికెన్‌ బిర్యానీలో బ్లేడ్‌
చికెన్‌ బిర్యానీలో బ్లేడ్‌

కస్టమర్ల అవాక్కు.. పోలీసులకు ఫిర్యాదు

కావాలనే చేశారు : బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): హోటళ్లలో తినే పదార్థాల్లో సహజంగా పురుగులు, బొద్దింకలు రావడం చూశాం. కానీ ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఏకంగా బిర్యానీలో బ్లేడ్‌ వచ్చింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా, బీబీనగర్‌ మండలం, మక్త అనంతారంనకు చెందిన బింగి అయిలయ్యయాదవ్‌ ముగ్గురు స్నేహితులతో కలిసి ఘట్‌కేసర్‌ బైపాస్‌లోని ఆదర్శ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. వెయిటర్‌ బిర్యానీ తీసుకొచ్చాడు. అనంతరం బిర్యానీ తింటుండగా.. అందులో బ్లేడ్‌ ప్రత్యక్షమైంది. బార్‌ యాజమాన్యాన్ని పిలిచి బిర్యానీలో బ్లేడ్‌ వచ్చిందని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అయిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బిర్యానీలో బ్లేడ్‌ వచ్చిందని కావాలనే క్రియేట్‌ చేశారని ఆదర్శ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం తెలిపింది. బిర్యానీ చేసే క్రమంలో బియ్యాన్ని నీళ్లలో మూడుసార్లు కడిగి వడబోస్తామని, అప్పుడు రాని బ్లేడ్‌ తరువాత ఎలా వచ్చిందన్నారు. కావాలనే బార్‌ పరువు తీయాలని అలా చేశారని బార్‌ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

బిర్యానీలో ఇనుప ముక్కలు!

కస్టమర్లపై హోటల్‌ నిర్వాహకుల దాడి

పూడూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చిన యువకులను హోటల్‌ యజమాని వర్కర్లతో కలిసి దాడిచేసి చితకబాదారు. ఈ సంఘటన పూడూరు మండల పరిధిలోని చిట్టెంపల్లి గేటు సమీపంలో ఉన్న నక్షత్ర రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్‌నకు చెందిన ఆరుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం నక్షత్ర రెస్టారెంట్‌లో భోజనానికి వెళ్లారు. అనంతరం బిర్యానీ ఆర్డర్‌ ఇచ్చారు. వెయిటర్‌ బిర్యానీ తెచ్చి ప్లేట్లో పెడుతుండగా ఇనుప ముక్కలు వచ్చాయి. దాంతో యువకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వేరే బిర్యానీ మార్చి ఇస్తామని చెప్పారు. దాంతో సరేనన్నారు. అయితే, ఆ తర్వాత తీసుకొచ్చిన బిర్యానీకూడా నాసిరకంగా ఉండటంతో యువకులు, నిర్వాహకుల మధ్య మాటామాటా పెరిగింది. నక్షత్ర హోటల్‌ యజమాన్యం ఆరుగురు యువకుల్లో నలుగురు యువకులను చితకబాదగా ఇద్దరు తప్పించుకున్నారు. యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదనరెడ్డి తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 11:52 PM