తెల్లబోయిన పత్తి రైతు
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:19 PM
పత్తి రైతును కష్టాలు చుట్టుముట్టాయి. అన్ని అవస్థలకు ఓర్చి సాగు చేసిన పత్తిని తీసేందుకు కూలీల కొరత కుదిపేస్తుంది. స్థానికంగా కూలీలు దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.
మద్దతు ధర తగ్గించిన సీసీఐ
ఓ వైపు దిగుబడి దిగులు..మరోవైపు పత్తి తీతకు కూలీల కొరత
పొలంలోనే రాలుతున్న పంట
దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు
చౌదరిగూడ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పత్తి రైతును కష్టాలు చుట్టుముట్టాయి. అన్ని అవస్థలకు ఓర్చి సాగు చేసిన పత్తిని తీసేందుకు కూలీల కొరత కుదిపేస్తుంది. స్థానికంగా కూలీలు దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ కూలీలకు కిలో పత్తికి రూ.14 చెల్లించి పత్తి పంట ఇంటికొచ్చిందని సంతోషపడే లోపే సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మద్దతు ధర రూ.50 తగ్గించి రైతులకు షాక్ ఇచ్చింది. కొందుర్గు మండలంలో 9260 ఎకరాలు, జిల్లేడ్ చౌదరిగూడ మండలం 4,500 వందల ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగుచేశారు. అయితే కూలీలు కొరతతో చెట్ల మీద ఉన్న పత్తి పొలంలోనే రాలిపోతుంది. డిమాండ్ కారణంగా కూలి రేటు కూడా పెంచేశారు. మొదట కిలో పత్తి ఏరితే రూ.10 చెల్లించేవారు. ప్రస్తుతం 12 రూపాయలు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. చుట్టుపక్క గ్రామాల నుంచి కూలీలను ఆటోలో తీసుకురావాల్సి వస్తుంది. ఆటో కిరాయి రూ.1200, దావతులు తదితర ఖర్చులు రైతుకు తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ కనీస మద్దతు ధర రూ.500 పెంచింది. దీంతో పత్తి క్వింటాల్ ధర రూ.7521 ధర నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించారు. 8శాతం తేమ ఉన్న పత్తికి ఈ మద్దతు ధర చెల్లిస్తామని నవంబరులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. నెల రోజులు గడవక ముందే మద్దతు ధరలో రూ.50 తగ్గించారు. ఉమ్మడి మండలంలో మొదటి దఫా పత్తి కోతలు కూడా పూర్తికాక ముందే కాటన్ కార్పొరేషన్ ధర తగ్గించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు కూలీలు దొరకక పత్తి సేకరణ ఆలస్యమవుతుండగా, పెట్టుబడి ధరలు పెరిగి, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక అవస్థ పడుతుంటే గిట్టుబాటు ధర కూడా తగ్గిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు చివరి వరకు ధర తగ్గించకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
పొలంలోనే పత్తి
30 ఎకరాలను కౌలుకు తీసుకొని 15ఎకరాల్లో పత్తి సాగు చేశా. సకాలంలో వర్షాలు కురవక సాగు ఆలస్యమైంది. పత్తి తీసేందుకు కూలీలు కూడా దొరకడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర తగ్గిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
దయ్యాల శ్రీశైలం, పత్తి రైతు, కొందుర్గు మండలం
అప్పే మిగిలింది
మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. సాగు కోసం ఎకరానికి 40వేలు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
వడ్లబుచ్చయ్య , రైతు, తుమ్మలపల్లి, జిల్లేడ్ చౌదరిగూడ మండలం