Share News

నీటి సంపులో పడి బాలుడి మృతి

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:14 AM

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

నీటి సంపులో పడి బాలుడి మృతి

యాలాల, సెప్టెంబరు 6: నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దౌలాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, యాలాల ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దౌలాపూర్‌ గ్రామానికి చెందిన వడ్డె వెంకటప్ప, మల్లమ్మలకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ సంతానమైన శివకుమార్‌(10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. వర్షాల కారణంగా వీరు నివాసముంటున్న ఇల్లు గతంలో కూలిపోయింది. ఈ సంవత్సవరం కూడా భారీవర్షాలు పడడంతో గ్రామంలోని గ్రామపంచాయతీలో ఉండాలని గ్రామస్తులు సూచించారు. దీంతో వారు కుటుంబసభ్యులతో కలిసి గురువారం గ్రామపంచాయతీ భవనంలో ఆవాసం పొందుతున్నారు. శుక్రవారం ఉదయం వెంకటప్ప మల్లమ్మకుమారుడు శివకుమార్‌ గ్రామ పంచాయతీ భవనం ముందున్న సంపులోకి నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు సంపులో పడి మునిగిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు..

దోమ: రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ఐనాపూర్‌ గ్రామానికి చెందిన గార్లపల్లి కృష్ణ(24) గతనెల 30వ తేదీన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. మల్లెపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ బైక్‌పై ఐనాపూర్‌కు వస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అన్న రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 12:14 AM