Share News

బుగ్గక్షేత్రం.. భక్త జనసంద్రం

ABN , Publish Date - Nov 15 , 2024 | 11:53 PM

కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దక్షిణకాశీగా పిలువబడే బుగ్గరామలింగేశ్వర క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ప్రారంభమైంది.

బుగ్గక్షేత్రం.. భక్త జనసంద్రం
బుగ్గజాతరకు పోటెత్తిన భక్తులు

శివనామస్మరణతో మార్మోగిన ఆలయం

కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు

మంచాల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దక్షిణకాశీగా పిలువబడే బుగ్గరామలింగేశ్వర క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ప్రారంభమైంది. పుష్కరిణిలో కార్తీకస్నానాలు ఆచరించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ప్రమిదలు వెలిగించి నైవేద్యం సమర్పించారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శుక్రవారం బుగ్గక్షేత్రాన్ని సందర్శించి పార్వతీపరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. రూ.6 లక్షల నిధులతో చేపట్టిన షెడ్డును ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బుగ్గజాతరలో భక్తులకు ఇబ్బంది కలగకుండా వసతి కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 11:53 PM