కరాటేపై చిన్నారుల ఆసక్తి
ABN , Publish Date - May 16 , 2024 | 12:28 AM
కరాటే నేర్చుకోవడంపై చిన్నారుల ఆసక్తి కనబరుస్తున్నారు. షాబాద్ మండల కేంద్రంలో పీఆర్‌ఆర్ మినీ స్టేడియంలో కరాటే శిక్షణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగం
షాబాద్, మే 15 : కరాటే నేర్చుకోవడంపై చిన్నారుల ఆసక్తి కనబరుస్తున్నారు. షాబాద్ మండల కేంద్రంలో పీఆర్‌ఆర్ మినీ స్టేడియంలో కరాటే శిక్షణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బుడోకాన్ స్టార్ కరాటే క్లబ్ మాస్టర్ ఈర్లపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. కాగా, నర్సింహులు ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాస్థాయిలో ఎన్నో పోటీల్లో చిన్నారులు, యువకులు పాల్గొని ప్రతిభ కనబర్చి పలు మెడల్స్ గెలుచుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే నేర్పేందుకు ఎంతో ఇష్టపడుతున్నారు. పిల్లలు కరాటే శిక్షణ పొందితే ఆరోగ్యంతో పాటు ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు చిన్నారులకు శిక్షణ ఇస్తూ పరీక్షలు నిర్వహించి బెల్టులు ప్రదానం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ కోరుతున్నారు.
ఆత్మరక్షణలో మెళకువలు నేర్చుకుంటున్నా
కరాటేలో శిక్షణలో భాగంగా ఆత్మరక్షణకు మెళకువలు నేర్చుకుంటున్నా. మాస్టర్ ఎంతో చక్కగా, ఓపికగా శిక్షణ ఇస్తున్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ధృడంగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది.
- కె. అభిలాష్, 5వ తరగతి, పోతుగల్
ప్రతి రోజూ సాధన చేస్తున్నా
ప్రతి రోజు శిక్షణానంతరం కరాటే సాధన చేస్తూ మరింత పటిష్టంగా తయారవుతున్నా. మాస్టర్ సమక్షంలో కరాటే నేర్చుకోవడం సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో తాను కూడా పది మందికి ఉచితంగా కరాటే నేర్పిస్తా.
- సి. సాయికృష్ణ, 5వ తరగతి, సీతారాంపూర్
శారీరక దృఢత్వానికి ఎంతో మేలు
పిల్లల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేకంగా కరాటేను నేర్పిస్తున్నాం. కరాటే వంటి యుద్ధ విద్యలతో శారీరక దృఢత్వం పెంపొందుతుంది. పిల్లల ఆసక్తిని, నేర్చుకునే విధానాన్ని బట్టి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుంది. వేసవి సెలవుల్లో ఉచితంగా శిక్షణనిస్తున్నా.
- మాస్టర్ ఈర్లపల్లి నర్సింహులు,
బుడోకాన్ స్టార్ కరాటే క్లబ్, షాబాద్