ఆట స్థలాలుగా పంట పొలాలు
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:06 AM
నేల తల్లినే నమ్ముకున్న రైతుకు పొలమే ఆధారం. అమ్మలాంటి సాగు భూమిని రియల్ వ్యాపారుల పరం చేసేందుకు మనసు రాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.
అమ్ముకోవడం ఇష్టం లేక మైదానాలుగా మార్పు
అద్దెకు ఇస్తూ ఆదాయం గడిస్తున్న రైతులు
మొయినాబాద్‌లో భారీగా వెలుస్తున్న గ్రౌండ్లు
వారాంతాల్లో నగరవాసుల సందడి
నేల తల్లినే నమ్ముకున్న రైతుకు పొలమే ఆధారం. అమ్మలాంటి సాగు భూమిని రియల్ వ్యాపారుల పరం చేసేందుకు మనసు రాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. పచ్చని పంట పొలాలను క్రీడలకు అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. దీంతో పంటలతో కళకళలాడిన పొలాల్లో క్రీడామైదానాలు దర్శనమిస్తున్నాయి. ఉద్యోగం, సంపాదనలో శ్రమించే నగరవాసులు వారాంతాల్లో నగర శివారులోని మొయినాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లోని పంటపొలాల్లో వెలిసిన క్రీడామైదానాల్లో ఆటపాటలతో సందడి చేస్తూ సేదతీరుతున్నారు.
మొయినాబాద్ రూరల్, నవంబరు18: పచ్చని పంటలకు వేదికగా ఉన్న పొలాల్లో క్రీడా మైదానాలు వెలుస్తున్నాయి. నీటి కొరత, గిట్టుబాటు ధరలు లేక కొందరు రైతులు పొలాలను అమ్ముతుండగా మరికొందరు వాటిని క్రీడా మైదనాలుగా మార్చుకొని ఆదాయాన్ని గడిస్తున్నారు. కోటి జనాభా ఉన్న భాగ్యనగరంలో సరిపడా క్రీడా మైదానాలు లేకపోవడంతో ప్రైవేటు క్రీడా మైదానాలకు డిమాండ్ పెరిగింది. నగరంలోని పలు పేరున్న విద్య సంస్థల్లో మాత్రమే క్రీడా స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు అకాడమీల్లో సైతం మైదానాలు ఉన్నప్పటికీ అక్కడ అందరూ ఆడడానికి అవకాశాలు ఉండవు. దీంతో ఔటర్ రింగురోడ్డు అవతల నగర శివారు చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులు తమ పొలాల్లో క్రీడా మెదానాలను ఏర్పాటు చేసి క్రీడలకు అనువుగా అభివృద్ధి చేసి వారే నిర్వహిస్తున్నారు. మరికొంత మంది ఆదాయం బాగుందని తమ వ్యవసాయ భూములను మైదానాల కోసం లీజుకిస్తూ ఆదాయం గడిస్తున్నారు. కొంతమంది పొలాలను కొనుగోలు చేసి మైదానాలుగా మారుస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇలాంటివి అందుబాటులోకి వచ్చాయి. సంపాదనలో శ్రమించే నగరవాసులు వారాంతాల్లో నగర శివారులో పంటపొలాల మధ్య వెలిసిన క్రీడామైదానాల్లో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సేదదీరుతున్నారు.
వారాంతాల్లో సందడే సందడి
ఏదైనా కొత్త పోకడ వచ్చిందంటే అది ఐటీ ఉద్యోగుల నుంచే మొదలవుతుంది. ప్రైవేటు క్రీడా మైదానాలకు డిమాండ్ సైతం వీరి నుంచే డిమాండ్ ఎక్కువ. తమ ఉద్యోగుల్లో వ్యాయామాన్ని ప్రోత్సహించేందుకు, కలిసి పనిచేసే తత్వాన్ని పెంపొందించేందుకు ఎంఎన్‌సీ కంపెనీలు వార్షిక క్రీడా పోటీలను నిర్వహిస్తుంటాయి. ఇందుకోసం శివారులోని మైదానాలను లీజుకు తీసుకుంటున్నాయి. వీరి బాటనే మరికొన్ని సంస్థలు అనుకరిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు కళాశాలల విద్యార్థులు, స్నేహితులతో కలిసి వారాంతంలో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగర శివారుల్లో ఏర్పాటు చేసిన మైదానాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతో ముందుగానే బుక్ చేసుకోని ఆడుతున్నారు. దీంతో శనివారం, అదివారం రోజుల్లో నగరశివారు ప్రాంతం సందడిగా మారుతోంది.
ఒక్కో మ్యాచ్‌కు రూ.10వేలు
క్రీడా మైదనాలు ఎక్కువగా నగర శివారు మొయినాబాద్ మండలంలోని వివిద గ్రామాల్లో భారీ సంఖ్యలో ఉన్నాయి. నగరం నుంచి వచ్చే క్రీడాకారులు ఈ మైదానాలకు చేరుకోవడానికి ఆరగంట మాత్రమే సమయం మాత్రమే పడుతుండడంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో క్రీడామైదానాలకు డిమాండ్ పెరిగింది. మండలంలోని హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎన్కేపల్లి, బాకారం, నాగిరెడ్డిగూడ, మూర్తుజగూడ, ఆమ్డాపూర్, సురంగల్, శ్రీరాంనగర్, చిలుకూరు, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, చిన్నమంగళారం, మేడిపల్లి, మోత్కుపల్లి తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో క్రీడామైదానాలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లోనూ అద్దెకు ఇచ్చేందుకు నిర్వాహకులు లైట్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మైదానానికి నెలలో కనీసం రూ. లక్ష వరకు ఆదాయన్ని పొందుతున్నారు. మైదానాల్లో క్రికెట్ ఆడేందుకు నిర్వాహకులు ఒక్క మ్యాచ్‌కు ఉదయం రూ. 5 వేలు, మధ్యాహ్నం, సాయంత్రం రూ. 3 వేల చొప్పున తీసుకుంటున్నారు. వారాంతంలో ఒక్కో మ్యాచ్‌కు రూ.10 వేలకు డిమాండ్ ఉందంటే ఏ తీరుగా క్రీడామైదానాల డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
విస్తరిస్తున్న సేవలు
తొలుత క్రికెట్ మైదానం వరకు అభివృద్ధి చేసినా ఆటగాళ్ల డిమాండ్ మేరకు క్రమంగా ఇతర సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆటలు ఆడిన తర్వాత సేద తీరేందుకు అక్కడే ఈత కొలనులను ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాకారులు నృత్యాలు చేసేందుకు వీలుగా డ్యాన్స్ ఫ్లోర్, సౌండ్ సిస్టం సమకూరుస్తున్నారు. రాత్రి పూట బస చేసేందుకు వీలుగా వసతి గృహాలు ఉంటున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారాన్ని కొన్ని మైదానాల్లో క్రీడాకారుల ఇష్టానుసారం అల్పాహారం, మాంసాహారం, శాఖాహార భోజనాలు, పండ్ల రసాలు, టీ, కాఫీ, శీతల పానీయాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.
లాభదాయకంగా ఉంది
నాకు ఎన్కేపల్లి గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అప్పట్లో బాగానే వ్యవసాయం చేసేవాళ్లం. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు పెట్టుబడి పెరిగింది. దీంతో పొలాలను అమ్ముకోలేక క్రీడా మైదానాలుగా మారుస్తున్నాం. 10 ఎకరాల్లో వ్యవసాయం మానేసి మూడు క్రికెట్ మైదానాలను ఏర్పాటు చేశాను. వీటిద్వారా ఆదాయం బాగానే వస్తుంది. రైతులు తమ విలువైన భూములను అమ్ముకోకుండా మైదానాలు నిర్మించి లాభాలు గడించాలి.
- భీమేందర్ రెడ్డి, క్రికెట్‌మైదానం యజమాని, ఎన్కేపల్లి
మైదానాల ఏర్పాటు అభినందనీయం
రైతులు తమ పంట పొలాలను అమ్ముకోకుండా క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తుండడం వల్ల నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చేందుకు ఈ మైదానాలు దోహదం చేస్తాయి. నగరంలో క్రీడామైదానాలు లేకపోవడంతో శివారులోని ఆహ్లాదకరమైన వాతవరణంలో ఆటలు ఆడేందుకు మంచి అవకాశం లభిస్తుంది.
- రాజు గౌడ్, క్రీడాకారుడు, ఎన్కేపల్లి