నాగారంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:08 AM
నాగారం మున్సిపాలిటీ పరిధి రాజ్‌సుక్‌నగర్ కాలనీలో రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు తొలగించారు.
రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసిన ప్రహరీ
స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు
కీసర రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నాగారం మున్సిపాలిటీ పరిధి రాజ్‌సుక్‌నగర్ కాలనీలో రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని బుధవారం హైడ్రా అధికారులు తొలగించారు. కొద్ది రోజులుగా కాలనీవాసులకు, సదరు ప్లాటు యజమానికి నడుమ వివాదం కొనసాగుతోంది. అది ప్లాట్ అని ప్లాట్ యజమాని, కాదు అది రోడ్డు అని కాలనీవాసులు ఎవరికివారు వాగ్వాదానికి దిగి ఫిర్యాదులు చేస్తున్నారు. కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల బందోబస్తు నడుమ, ఎక్స్‌కవేటర్ సాయంతో రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసిన ప్రహారీని తొలగించారు. ప్రహారీని తొలగించటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్లాట్ యజమాని పాపిరెడ్డి మాట్లాడుతూ కొందరు గిట్టని వారు పనిగట్టుకుని ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారన్నారు. న్యాయస్థానంలో కేసు కొనసాగుతుండగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడమేంటని ఆందోళన వ్యక్తం చేశాడు.