అన్నీ అప్పులే.. ఆస్తుల్లేవ్
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:11 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో ఎన్యూమరేటర్లకు తిప్పలు తప్పడం లేదు. ప్రజల నుంచి వచ్చే సమాధానాలతో అవాక్కవుతున్నారు.
-సర్వేలో వస్తున్న సమాధానాలివే
-ఆధార్, అప్పుల వివరాలు మాత్రమే వెల్లడి
-మిగతా ప్రశ్నలను దాటవేస్తున్న ప్రజలు
-సర్వేలో ఎన్యుమరేటర్లకు తప్పని తిప్పలు
-సర్వేపై అవగాహన కల్పించడంలో విఫలం
మేడ్చల్ ప్రతినిధి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల నుంచి వస్తున్న సమాధానాలతో ఎన్యూమరేటర్లకు తిప్పలు తప్పడం లేదు. ప్రజల నుంచి వచ్చే సమాధానాలతో అవాక్కవుతున్నారు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో వచ్చే సమాధానాలతో ఏమీ చేయలేక వారు చెప్పిందే రాసుకుంటున్నారు. సొంత ఆస్తులు లేవని.. అప్పులు మాత్రం ఉన్నాయని చెబుతుండటం గమనార్హం. కళ్లెదుటే సొంత భవనాలు, వాహనాలు కనిపిస్తున్నా అవి తమవి కాదంటూ చెబుతున్న సమాధానాలతో ఎన్యూమరేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా చేసేదేమీ లేక చెప్పింది నోట్ చేసుకుంటున్నారు.
సర్వేకు సహకరించని జనం
సమగ్ర కుటుంబ సర్వేలో పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో సర్వే ఎందుకని వారు వాపోతున్నారు. ఆధార్ కార్డు నంబర్లు, ఫోన్ నంబర్లు, రుణాలు వంటి సమాచారాలు మాత్రమే నిజంగా చెబుతున్నారు. ఆస్తులు, ఇళ్లు, కార్లు వంటి సమాచారం మాత్రం తెలుపడం లేదు. మరికొందరైతే ఏకంగా ముఖం మీదనే తిడుతున్నారని, సర్వేతో మాకేం పని, ప్రభుత్వం నుంచి మాకేం అవసరం లేదంటూ సర్వేకు సహకరించడం లేదని ఎన్యుమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, కార్ల వంటి వివరాలు చెబితే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయాందోళనలతో చాలా మంది సర్వేకు సహకరించడం లేదని తెలుస్తోంది. సొంత వాహనాలు లేవని, ఉంటున్న ఇళ్లు కూడా తమది కాదని, అద్దెకు ఉంటున్నామని, భూములు కూడా లేవనే విషయాలనే వెల్లడిస్తున్నట్లు సమాచారం. మరికొందరైతే ఏకంగా స్మార్ట్ ఫోన్ కూడా లేదని, ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి వివరాలు కూడా వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు.
అవగాహన లేకనే..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నా ప్రజల నుంచి సరైనా సమాధానాలు రాకపోతుండటం పట్ల ఎన్యూమరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించి తహసీల్దార్ ఇచ్చిన పట్టాలు, గృహాలకు సంబంధించిన ఇంటి నంబర్ల లీస్టుతో సర్వేకు వెళితే బాగుండేదని ఎన్యుమరేటర్లు చెబుతుండటం గమనార్హం. ప్రతీష్టాత్మకంగా సర్వే చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే సమాచారంతో ఉపయోగం లేదని పేర్కొంటున్నారు. సరే ్వ వివరాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉండవనే విషయాన్ని ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంత మేలు ఉండేదని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఉన్నతాధికారులు సర్వే తీరును పరిశీలిస్తు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా వివరాలు వెల్లడించేందుకు ప్రజలు ముందుకురాకపోవడం గమనార్హం.