Share News

నిప్పుల కుంపటి!

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:32 AM

భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బేజారవుతున్నారు. మధ్యాహ్నం వడగాలులు, రాత్రి ఉక్కపోతతో బెంబేలెత్తుతున్నారు.

నిప్పుల కుంపటి!

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మధ్యాహ్నం వడగాలులు, రాత్రి ఉక్కపోత

ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నారులు, వృద్ధులు

శేరిలింగంపల్లి, హఫీజ్‌పేటలోని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌

పరిధిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి : వైద్యులు

భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బేజారవుతున్నారు. మధ్యాహ్నం వడగాలులు, రాత్రి ఉక్కపోతతో బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 వరకు జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏదైనా పనిమీద బయటకు వెళితే శీతలపానీయాలు తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కాగా, అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయంటే మేలో ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 26 ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తెకు ముందే రోల్లు పగిలేలా ఉష్ణోగ్రలు ఠారెత్తిస్తున్నాయి. వారం రోజుల నుంచి భానుడి ఉగ్రరూపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగానే చేరాయి. మే నెల మధ్యలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ చివరి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేకచోట్ల వడగాలులు, కొన్నిచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నారు. వడగాలులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఘన్‌పూర్‌లో శుక్రవారం అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, హఫీజ్‌పేటలోని అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 43.5 డిగ్రీల గరిష్ఠ ష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం తొర్మామిడి-నాగారంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, జనం ఎండ వేడిమికి చెట్లనీడను వెదుకుతున్నారు. ఇంట్లో ఉక్కపోత భరించలేక చెట్ల కింద సేద తీరుతున్నారు. రాత్రి వేళలో ఫ్యాన్ల నుంచి వచ్చే వేడిగాలి భరించలేక ఆరుబయట పడుకుంటున్నారు. చిన్నపిల్లల, వృద్ధులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

ఎండ వేడిమికి జనం విలవిల

ఎండతో పాటు విపరీతమైన ఉక్కపోత, వడగాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. కొద్ది రోజులుగా ఎండలు తీవ్రంగానే ఉన్నప్పటికీ శుక్రవారం నాటి ఎండకు జనం బెంబేలెత్తిపోయారు. ఎక్కడ చూసినా రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. వృద్ధులు, చిన్నారులు ఇళ్లలో ఉన్నప్పటికీ ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు.

మోగుతున్న ప్రమాద ఘంటికలు

వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఎండ తీవ్రతల ఆధారంగా ప్రమాదకర స్థాయిని అంచనా వేస్తారు. వేసవిలో 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే.. దానిని సాధారణంగా పరిగణిస్తారు. 35 నుంచి 40 డిగ్రీల వరకు మోస్తరు ఉష్ణోగ్రతలుగా గుర్తిస్తారు. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 40 నుంచి 45 డిగ్రీల వరకు ప్రమాదకరంగా భావిస్తారు. అప్రమత్తత అవసరం. ఇక 45 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుంటే మంచిది. బయటకు వెళ్లినా తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రమాదకర స్థితి ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

ఉష్ణోగ్రతలు పెరగడంతో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తరచూ నీటిని తాగుతుండాలని, ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకూడదు. శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు.

జోరుగా శీతలపానీయాల విక్రయం

వేడి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బోండాలకు గిరాకీ బాగా పెరిగింది. పండ్ల రసాలు, శీతల పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మజ్జిగ విక్రయాలు గతంలో పోల్చితే రెండురెట్లు పెరిగాయి. రహదారులపై శీతల పానీయాలు, సోడా, షర్బత్‌ దుకాణాలు పెద్దఎత్తున వెలిశాయి. జ్యూస్‌ కోసం పుచ్చకాయలు, ద్రాక్ష, అరటి పండ్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎండ పెరిగిన నేపథ్యంలో క్యాప్‌(టోపీ)లకు కూడా డిమాండ్‌ పెరిగింది. మహిళలు గొడుగులతో రక్షణ పొందుతున్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే మహిళలు, యువతులు స్కార్ప్‌లతో కళ్లకు రక్షణ కల్పిస్తున్నారు. చలువ అద్దాలు ధరిస్తున్నారు. పురుషులు కూడా తలకు నూలు వస్త్రం చుట్టి హెల్మెట్‌ ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు.

మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దు

పెరుగుతున్న ఎండల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా పనులుంటే 10 గంటల్లోగా పూర్తి చేసుకోవాలి.. లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత చేసుకోవాలి. మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. ఎండాకాలం దూర ప్రయాణాలు మానుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఎల్లప్పుడూ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి

ఉమ్మడి జిల్లాలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు

తేదీ రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌

26 43.5 43.1 43.4

25 42.4 41.1 42.9

24 42.6 41.5 42.8

23 42.9 42.5 43.3

22 42.9 42.5 43.3

Updated Date - Apr 27 , 2024 | 01:10 AM