రోడ్డు అలైన్‌మెంట్‌తో రైతులకు తీవ్ర నష్టం
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:02 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ వరకు దక్షిణ భాగంలో రోడ్డు అలైన్‌మెంట్ కారణంగా తీవ్రంగా నష్టపోతామని తిమ్మాపురం, రాచులూరు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
తిమ్మాపురంలో నిరసన..కలెక్టర్‌కు వినతి
కందుకూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ వరకు దక్షిణ భాగంలో రోడ్డు అలైన్‌మెంట్ కారణంగా తీవ్రంగా నష్టపోతామని తిమ్మాపురం, రాచులూరు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిమ్మాపురంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నారాయణరెడ్డికి రైతులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయం నుంచి కందుకూరు మండలం మీర్కాన్‌పేట, బేగరికంచ గ్రామాలలో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోతో కూడిన 330ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం అధికారులు మూడు దిశల నుంచి సర్వేచేసి చివరగా విమానాశ్రయం నుంచి కొంగరకలాన్, రాచులూరు, తిమ్మాపురం గ్రామాల మీదుగా బేగంపేట, తుర్కగూడ, గాజులబురుజు తండాల మీదుగా మీర్కాన్‌పేట వరకు రోడ్డు వేయడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అయితే ఆయా గ్రామాలో భూసేకరణ విషయంలో పరిహారం గురించి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులతో చర్చించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోడ్డు వేయడానికి 441ఎకరాలు అవసరం కాగా, అందులో 100ఎకరాలకు పైగా సన్న, చిన్నకారు రైతులు 200మంది తమ వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు భూమికి భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మీనర్సింహారెడ్డి, సామయ్య పాల్గొన్నారు.