Share News

గుంతల రోడ్డుతో నరకయాతన

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:09 AM

గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలతో గ్రామాలకు బీటీ, సీసీరోడ్ల నిర్మించాయి. అందులో భాగంగా నందిగామ మండల కేంద్రం నుంచి వీర్లపల్లి, చంద్రాయన్‌గూడ సమీపంలోని పాతజాతీయ రహదారి నుంచి మామిడిపల్లి వరకు కోట్ల రూపాయలతో గతంలో బీటీరోడ్డు నిర్మాణం చేపట్టారు.

గుంతల రోడ్డుతో నరకయాతన
భారీ వాహనాల రాకపోకలతో గుంతలమయంగా మారిన నందిగామ-వీర్లపల్లి రోడ్డు

భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసం

అధ్వానంగా నందిగామ-వీర్లపల్లి రహదారి

వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు

నందిగామ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలతో గ్రామాలకు బీటీ, సీసీరోడ్ల నిర్మించాయి. అందులో భాగంగా నందిగామ మండల కేంద్రం నుంచి వీర్లపల్లి, చంద్రాయన్‌గూడ సమీపంలోని పాతజాతీయ రహదారి నుంచి మామిడిపల్లి వరకు కోట్ల రూపాయలతో గతంలో బీటీరోడ్డు నిర్మాణం చేపట్టారు. వీర్లపల్లి శివారులోని పలు ఐరన్‌ పరిశ్రమలు ముడిసరుకుతో పాటు వారు తయారుచేసే ఐరన్‌ను భారీ వాహనాల్లో అధిక లోడ్‌తో తరలిస్తుండటంతో నందిగామ-వీర్లపల్లి రోడ్డు, చంద్రాయన్‌గూడ-మామిడిపల్లి రోడ్డు నిర్మించిన కొన్ని రోజులకే ధ్వంసమయ్యాయి. రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గాల ద్వారా అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, ఈదులపల్లి, మొదళ్లగూడ, మామిడిపల్లి, సింబియాసిస్‌ యూనివర్సిటీకి వెళ్లేవారు ద్విచక్ర వాహనం, కార్లలో ఎక్కవగా ప్రయాణాలు సాగిస్తుంటారు. గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై సుమారు 25 టన్నుల సామర్థ్యంతో ఉన్న వాహనాలు వెళ్లేవిధంగా రోడ్డునిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమకు సంబంధించిన వాహనాలు 50 టన్నుల పైనే ఉన్న లోడ్‌తో వెళ్తుండటంతో రోడ్డు ధ్వంసమైందని పలువురు ఆరోపి స్తున్నారు. రోడ్డు వేసిన కొన్ని రోజులకే పరిస్థితి దయనీయంగా మారడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు బాగుచేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:09 AM