రసాయన ఎరువులతో చేటు!
ABN , Publish Date - May 13 , 2024 | 12:49 AM
అధిక దిగుబడి సాధించేందుకు రైతులు విరివిగా రసాయన ఎరువులు వాడుతున్నారు.
మోతాదుకు మించి వాడుతున్న రైతులు
సహజత్వాన్ని కోల్పోతున్న నేల
సేంద్రియ ఎరువుల వాడకంపై రైతుల అనాసక్తి
సూచనలు పాటించాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
యాచారం, మే 12 : అధిక దిగుబడి సాధించేందుకు రైతులు విరివిగా రసాయన ఎరువులు వాడుతున్నారు. పశువుల పేడ, గొర్లు మేకల ఎరువు, వర్మి కంపోస్టు, వానపాముల ఎరువుల తదితర సహజ ఎరువులు వాడకపోవడంతో రోజురోజుకూ భూసారం తగ్గుతోంది. మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం నేల సహజ స్వరూపాన్ని మార్చేస్తోంది. రసాయనాల ప్రభావంతో భూమిలోని ముతక లోహాలు క్షీణిస్తున్నాయి. ఇది మున్ముందు ప్రమాదకరం పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో భూసార పరీక్ష కేంద్రం ఉన్నా ఎక్కువ మంది రైతులు తమ భూమిలో మట్టి పరీక్షలు చేయించడం లేదు. మట్టి పరీక్షలు చేయిస్తే ఏ ఎరువులు ఎంత మేర వాడాలనే లెక్క ఉంటుంది. భూసార పరీక్షలతో కలిగే లాభాల గురించి రైతులకు చెబుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు.
గ్రామ స్థాయిల్లో పరీక్షలు చేస్తే మేలు!
నేడు ప్రతీ మండలంలో నాలుగు రైతు వేదికలు నిర్మించినా అక్కడ భూసార పరీక్షలు చేసే కిట్లను ఉంచడం లేదు. డివిజన్ పరిధిలోనో లేక మరెక్కడో కాకుండా క్లస్టర్ రైతు వేదికల్లో అయినా భూసార పరీక్షల నిర్వహిస్తే గ్రామాల్లోని చాలా మంది తమ పొలాల మట్టిని సేకరించి పరీక్ష చేయించే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. ఎక్కడో దూరానికి మట్టిని తీసుకుళ్లడం, మట్టి పరీక్ష ఫలితాల కోసం చాలారోజుల పాటు వేచి చూడడం వంటి పరిస్థితుల వల్లే రైతులు భూసార పరీక్షలకు పెద్దగా ఆసక్తి చూడపం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించక కూడా భూమి సహజత్వాన్ని కోల్పోతోంది. ఏడాదిలో ఒక భూమిలో కనీసం రెండే వేర్వేరు పంటలు పండించాలి. అలా చేస్తేనే అన్ని రకాల సారం పంటలకు అంది దిగుబడి పెరుగుతుంది. అలాగే రసాయన ఎరువుల వాడకం తగ్గే ఆస్కారం ఉంటుంది. వరి సాగుకు ఎకరానికి ఒక బస్తా యూరియా వాడాలి. రైతులు మూడు, నాలుగు బస్తాలు చల్లుతున్నారు. సహజ ఎరువులను ఎంత వాడినా నేల స్వభావం మారదని, కానీ రసాయ ఎరువుల ఎంత ఎక్కువ వాడితే నేల అంత పాడై రానురాను మొక్కల ఎదుగులే లేకుండా పోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నేలకు సారాన్నిచ్చే చెరువు, కుంటల మట్టి
మెట్ట పంటలకు టిక్కిమట్టితో పాటు పశువులపేడ, మేకల, గొర్రెల ఎరువు, కోడి ఎరువు వాడితే దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టిక్కి మట్టిలో హ్యూమస్ ఉండి నేల సారవంతంగా మారుతుందన్నారు. ఎలాంటి నేలనైనా పంటలకు అనుగుణంగా మార్చే శక్తి చెర్లు, కుంటల్లోని మట్టికి ఉంటుందన్నారు. చెరువులు ఎండిపోయిన ఇలాంటి సందర్భాల్లో ప్రతీ ఎకరానికి వంద నుంచి 150 టిప్పుల ట్రాక్టర్ల మట్టిని తోలుకోవాలని సూచించారు. ఇలా చేస్తే నేల పైపొర సారవంతగా మారుతుంది. అలాగే పొలంలో తేమ ఎక్కువ రోజులు ఉంటుంది. పొలంలో మట్టి కొట్టుకుంటే పంటలకు యూరియా, పొటాషియం ఎరువుల తక్కువ మోతాదులో వేసుకున్నా దిగుబడి వస్తుంది. టిక్కిమట్టిలో ఉదజని7.4శాతం, నత్రజని 108.33శాతం, భాస్వరం 43.3శాతం, పొటాషియం 227.15 శాతం ఉంటాయని వ్యవసాయాధికారులు తెలిపారు. ఆవు పేడలో 40శాతం న్యూట్రిషన్, 20శాతం పొటాషియం, 10శాతం కాల్షియం ఉంటుందన్నారు. ఇవన్నీ నేలకు సారాన్ని ఇచ్చేవే అన్నారు. పైగా సహజ విధానంలో వాటిని చేకూర్చడం ద్వారా పంట నాణ్యత కూడా బాగుంటుందని చెబుతున్నారు.
సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులను చైతన్యపరచాలి : కె.జోగిరెడ్డి, రైతు, నందివనపర్తి
చాలా మంది రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన లేదు. రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడి నష్టపోతున్నారు. రైతులు గొర్లు, మేకల, పశువుల ఎరువును వాడితే దిగుబడి పెరగడమే కాక నేలకు సైతం మంచి చేసిన వారం అవుతాం. ప్రతీ సంవత్సరం కచ్చితంగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. పచ్చి రొట్ట మొక్కలు పెంచి భూమిలో కలియ దున్నాలి. ఇలాంటి విధాలను పాటిస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం : జీఎ్‌స.సందీ్‌పకుమార్, ఏవో, యాచారం
మేం తరచూ రైతులను కలిసి రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడాలని చెబుతున్నాం. రసాయన ఎరువులు ఎక్కువ వాడితే మొక్కపచ్చగా వస్తుందేమో గానీ భూసారం నశిస్తుంది. నేల సహజ స్వరూపాన్ని కోల్పోతుందని రైతులకు వివరిస్తున్నాం. పశువుల పేడ, మేకల, గొర్ల ఎరువు, కోళ్ల ఎరువు వాడితే కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నాం. అయితే ఏళ్లుగా రసాయన ఎరువుల వాడకానికి అలవాటు పడిన రైతులు మా సూచనలు ఎక్కువగా పాఇంచడం లేదు. పంట మార్పిడి విధానాన్ని తప్పక పాటించాలనీ చెబుతున్నాం.