Share News

హనీట్రాప్‌ నిందితుల అరెస్ట్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:10 PM

సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో హనీ ట్రాప్‌ ద్వారా ఓ వ్యాపారవేత్తకు వలవేసి కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన ఐదుగురు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హనీట్రాప్‌ నిందితుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సునీతారెడ్డి

-ప్లాట్లు ఉన్నాయంటూ పిలిచి రియల్టర్‌ కిడ్నాప్‌

-రూ.3 కోట్లు డిమాండ్‌.. రూ.20లక్షలకు ఒప్పందం

-కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురి రిమాండ్‌

ఇబ్రహీంపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో హనీ ట్రాప్‌ ద్వారా ఓ వ్యాపారవేత్తకు వలవేసి కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసిన ఐదుగురు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన వివరాలు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. మండలంలోని చెర్లపటేల్‌గూడ గ్రామానికి చెందిన కొరివి ధన్‌రాజ్‌ (42) ఎంబీబీఎస్‌ చదువును మధ్యలో వదిలేశాడు. అనంతరం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాణించాలని తన తల్లి పేరుతో ఉన్న ఆరెకరాల భూమిని సోదరులకు తెలియకుండా తన పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. అక్కడి నుంచి తన మకాంను వనస్థలిపురం పరిధి వైదేహీనగర్‌కు మార్చాడు. తనకున్న భూమిలోంచి రెండెకరాలు విక్రయించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బు సంపాదించాలని ప్లాన్‌ వేశాడు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నంకు చెందిన వస్త్ర వ్యాపారి, రియల్టర్‌ రచ్చ నారాయణను టార్గెట్‌ చేశాడు.

ఐదుగురుతో కలిసి కిడ్నాప్‌

అనుకున్నట్లుగానే ముందుగా ఎస్సై యూనిఫాం, షూస్‌, డమ్మీ పిస్టల్‌, ఓ కత్తిని కొనుగోలు చేశాడు. తనకు పరిచయమున్న సికింద్రాబాద్‌ మౌలాలికి చెందిన బ్యూటీషియన్‌ మక్కల భవాని(27)తో ఫోన్‌ చేయించి తమ వద్ద ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగులూరు దగ్గర మెట్రో సిటీకి రావాల్సిందిగా కోరగా ఈ నెల 21న నారాయణ అతని డ్రైవర్‌ ముజిబ్‌ఖాన్‌తో కలిసి కారులో వెళ్లారు. అక్కడ తన మేనల్లుడైన శివకుమార్‌ (26), అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన సుర్వి శేఖర్‌ (33), ఇబ్రహీంపట్నం మండలం కర్నంగూడకు చెందిన డేరంగుల శ్రీకాంత్‌ (26)లతో కలిసి కారులో నారాయణతోపాటు డ్రైవర్‌ ముజిబ్‌ఖాన్‌ను కిడ్నాప్‌ చేశారు. వారి ముఖాలకు నల్లటి ముసుగులు వేసి 45 నిమిషాలసేపు కారులో తిప్పి ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న ఓ వెంచర్లో ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై డ్రెస్‌లో ఉన్న ధన్‌రాజ్‌ నారాయణకు తుపాకి పెట్టి బెదిరించాడు.

బాండ్‌పేపర్‌పై సంతకాలు

ఆ అమ్మాయిలతో నీకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని, రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పగా చివరగా బేరమాడి రూ.20 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల్లో డబ్బు సర్దుబాటుచేసే విధంగా ఓ బాండ్‌ పేపరుతోపాటు రెండు తెల్లటి పేపర్లపై నారాయణ సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత మేం నిజమైన పోలీసులం కాదని పోలీసులకు చెబితే చంపుతామంటూ బెదిరించారు. ఆ తర్వాత కారులో కొంతదూరం తీసుకెళ్లి నారాయణతోపాటు డ్రైవర్‌ను వదిలేశారు. ఇదే విషయమై నారాయుణ ఈ నెల 23న ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేపీవీ రాజు పర్యవేక్షణలో ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని, కిడ్నాప్‌కు ఉపయోగించిన కంట్రీ గన్‌, ఓ కత్తి, పోలీస్‌ యూనిఫాం, ఏడు సెల్‌ఫోన్లు, కారుతోపాటు బాండ్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాఘవేందరెడ్డి, ఎస్సైలు రాజు, వెంకటేష్‌ వారి సిబ్బందిని డీసీపీ సునీతారెడ్డి అభినందిచారు.

Updated Date - Nov 29 , 2024 | 11:10 PM