Share News

కనుల పండువగా విగ్రహ ప్రతిష్ఠాపనలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:27 AM

నాగారం మున్సిపాలిటీ పరిధి శిల్పానగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్‌ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం కనుల పండుగగా నిర్వహించారు.

కనుల పండువగా విగ్రహ ప్రతిష్ఠాపనలు
స్వామి వార్లను దర్శించుకుంటున్న మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

కీసర రూరల్‌, ఏప్రిల్‌ 26: నాగారం మున్సిపాలిటీ పరిధి శిల్పానగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్‌ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు ఆంజనేయులుగౌడ్‌, కౌకుంట్ల అనంతరెడ్డిల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గత మూడు రోజులకు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో మూడోరోజు అనురాధ నక్షత్రం, కర్కట లగ్న పుష్కరాంశ సుముహూర్తాన వేంకటేశ్వరుడు, శివలింగం, హనుమాన్‌ విగ్రహాల ప్రతిష్ఠాపనను నిర్వహించారు. హోమం, పూర్హాహుతి తంతును నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసుపతి ప్రణీత, మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, దేవాదాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

బషీరాబాద్‌: మండలంలోని ఎక్మాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ పూజారి సుబ్బణ్ణ, సుదర్శన్‌ గ్రామపెద్దల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు విగ్రహ స్థాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు వేకువజామున వేద పండితుల మంత్రోచ్ఛరణలతో స్వామివారిని మేలుకొల్పారు. ఆలయ సన్నిధిలో హోమం, ప్రత్యేకపూజలతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - Apr 27 , 2024 | 12:27 AM