కొనుగోళ్ల జోరు
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:08 AM
జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారుల బారిన పడి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తిని ముమ్మరంగా సేకరిస్తున్నారు.
సీసీఐ ఆధ్వర్యంలో ముమ్మరంగా పత్తి సేకరణ
తెల్లబంగారంతో నిండిపోయిన జిన్నింగ్ మిల్లులు
ప్రైవేట్ కంటే ప్రభుత్వ మద్దతు ధర అధికంగా చెల్లింపు
జిల్లాలో గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో విక్రయాలు
ఏఎంసీకి పెరుగుతున్న ఆదాయం
14 కేంద్రాలకు 16,546.06 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు
జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దళారుల బారిన పడి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తిని ముమ్మరంగా సేకరిస్తున్నారు. గత సంవత్సరం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు పత్తిని ప్రైవేట్‌గా విక్రయించి నష్ట పోయారు. ఈ ఏడాది ప్రైవేట్ వ్యాపారుల కంటే ప్రభుత్వం అధిక ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంది. దీంతో రైతులు పత్తిని సీసీఐకి విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు.
రంగారెడ్డి అర్బన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈ సారి 1,76,174 ఎకరాల విస్తీర్ణంలో పత్తిపంటను సాగు చేశారు. సాగుకు అనుకూలంగా జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా షాద్‌నగర్‌లో 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆమగనల్లులో మూడు, చేవెళ్లలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది 1,27,786 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కొనుగోలు కేంద్రాల్లో 40 వేల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించారు. గత ఏడాది కంటే ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 48,388 ఎకరాల విస్తీర్ణంలో సాగు పెరిగింది. వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు 1.05 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 20492.31 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. అందులో సీసీఐ ద్వారా 16,546.06 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ వ్యాపారులు 3,946.25 మెట్రిక్ టన్నులు సేకరించారు.
వేగంగా చెల్లింపులు
ప్రైవేట్ వ్యాపారులు పత్తి క్వింటాలుకు రూ.6,800 ధర మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రూ.7,521 మద్దతు ధర అందిస్తుంది. దీంతో రైతులు పత్తిని అరబెట్టి నిర్ణీత తేమ శాతంతో తీసుకొచ్చి సీసీఐకి అమ్ముతున్నారు. దీంతో చాలామంది రైతులు మద్దతుఽ దర పొందుతున్నారు. పత్తి అమ్మిన రైతులకు వేగంగా డబ్బులు చెల్లిస్తున్నారు.
సమస్యలు రాకుండా చర్యలు
రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. దళారులను ఆశ్రయించకుండా నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలి. ఈ సారి రైతులకు డబ్బుల చెల్లింపుల్లో ఎలాంటి మోసాలు జరగకుండా బ్యాంకు ఖాతాకు, ఫోన్ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేశాం. త్వరగా చెల్లింపులు జరుగుతున్నాయి.
మహ్మద్ రియాజ్, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి
సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించా
రెండెకరాల్లో పత్తిని సాగు చేశాను. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి అయ్యింది. రెండెకరాల్లో 16 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్మిన. క్వింటాల్ పత్తికి తేమశాతాన్ని బట్టి రూ.7,400 ధర చెల్లించారు. డబ్బులు కూడా వచ్చాయి.
శ్రీనివాసచారి, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం