ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యేనా?
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:49 PM
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతీ నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. ఈనెల 14న(రేపు) రెండో విడుతగా బాలల దినోత్సవం రోజున మరికొన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తాం’ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తాండూరులో స్థల సేకరణ పూర్తి
ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
రేపు రెండో విడత ఇంటిగ్రేటెడ్
స్కూల్ మంజూరుకు శ్రీకారం
తాండూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రతీ నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. ఈనెల 14న(రేపు) రెండో విడుతగా బాలల దినోత్సవం రోజున మరికొన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తాం’ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హమీతో తాండూరు నియోజకవర్గం విద్యార్థులో ఆశలు చిగురించాయి. జిల్లాకు ఒకటి చొప్పున మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదటి విడతగా కొడంగల్ నియోజకవర్గానికి మంజూరుచేయగా అక్కడ భూమిపూజ కార్యక్రమం పూర్తయింది. యాలాల మండలం దౌలాపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం 25 ఎకరాల స్థలాన్ని గుర్తించిన అధికారులు మొదటి విడతలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు. అయితే తాండూరు పక్కనే ఉన్న కోడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో మొదటి దశలోనే కొడంగల్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం తిరిగి రెండో దశలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తాండూరులో తిరిగి ఆశలు చిగురించాయి. జిల్లాలో మిగతా నియోజకవర్గాల కంటే తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. రెండో దశలోనైనా తాండూరుకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇప్పటికే తాండూరు ప్రాంతం వెనుకబడి ఉన్నందున ఎలాంటి ఉన్నత విద్యా సంస్థలు లేవని తాండూరుకు వెంటనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేయాలని కోరారు. కొడంగల్ తనకు మొదటి కన్ను అయితే తాండూరు రెండో కన్ను అంటూ అప్పట్లోనే రేవంత్‌రెడ్డి తాండూరు ప్రజలకు మాట ఇచ్చినందున కొడంగల్‌తో సమానంగా అభివృద్దికి నిధులు ఇవ్వడంతో పాటు వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేయాలని కోరుతున్నారు.