మున్సిపాలిటీ విస్తరణ లేనట్లేనా?
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:07 AM
అర్హతలు ఉన్నా సకాలంలో ప్రతిపాదనలు పంపక పోవడంతో తాండూరు మున్సిపాలిటీ విస్తరణ పెండింగ్‌లో పడింది.
సకాలంలో చేరని ప్రతిపాదనలు
శివారు గ్రామాల్లో ఎన్నికలపై సందిగ్ధత
తాండూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అర్హతలు ఉన్నా సకాలంలో ప్రతిపాదనలు పంపక పోవడంతో తాండూరు మున్సిపాలిటీ విస్తరణ పెండింగ్‌లో పడింది. పట్టణ అభివృద్ధిలో భాగంగా తాండూరులో శివారులో ఉన్న ఆరు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మున్సిపల్ అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపేందుకు ఆలస్యం కావడంతో పాటుసరైన వివరాలు సమర్పించనట్లు సమాచారం. దీంతో మున్సిపాలిటీ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు పరిగి మున్సిపాలిటీకి సంబంధించి గ్రామాల వివరాలు సకాలంలో పంపడంతో పాటు సమగ్రవివరాలను పొందుపర్చడంతో ఆగ్రామాల విలీనానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
గ్రేడ్-1 మున్సిపాలిటీ అర్హతలు
వ్యాపార వాణిజ్య కేంద్రమే కాకుండా రెండు రాష్ట్రాలు(తెలంగాణ, కర్ణాటక) కూడలిగా ఉండి భిన్న సంస్కృతులు, భాషలకు నిలయంగా తాండూరు ఉంది. అదేవిధంగా గ్రేడ్-1 మున్సిపాలిటీగా తాండూరు మున్సిపాలిటీని మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ దిశగా అధికారులు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపిస్తే మున్సిపల్ ఎన్నికలు నాటి గ్రేడ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు విలీనమైతే కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం ఉంటుందని భావించిన ఆశావహులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా యాలాల మండలం కోకట్, తాండూరు మండలం అంతారం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు ఆసక్తి కనబర్చడంలేదు. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీలో 36వార్డులు ఉన్నాయి. పట్టణాన్ని విస్తరిస్తే వార్డుల సంఖ్య 50కి పెరిగే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటే కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
విలీన ప్రతిపాదన గ్రామాలివే
యాలాల మండలం కోకట్, బషీర్‌మియా తండా, తాండూరు మండలం ఖాంజాపూర్, కోనాపూర్, చేనెగే్‌షపూర్, అంతారం, అంతారం తండా, దస్తగిరిపేట్, గౌతాపూర్ గ్రామాలతో పాటు చెంగోల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవి వచ్చే చించోలి రోడ్డు మార్గంలోని పలు సర్వే నెంబర్లు కలపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ గ్రామాలు త్వరలో విలీనంకాని పక్షంలో ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆగ్రామాల్లో ఎన్నికలు పెండింగ్‌లో పెడుతారా? అనే సందేహం ఉంది. గతంలో కోకట్ గ్రామ పంచాయతీని తాండూరులో విలీనం కాకుండా కోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి స్టే పొందారు.