ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని మోసం
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:31 PM
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలుచేసి మోసం చేసిన వ్యక్తిపై శుక్రవారం సాయంత్రం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ధారూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలుచేసి మోసం చేసిన వ్యక్తిపై శుక్రవారం సాయంత్రం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని హరిదాసుపల్లికి చెందిన చింతకుంట రాములమ్మకు యాలాల మండలం, కోకట్‌లో శ్రీను అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని నమ్మించాడు. రాములమ్మ తమ గ్రామానికి రావాలని శ్రీనుకు తెలుపటంతో గత నెల శ్రీను ధారూరు చౌరస్తాకు వచ్చాడు. అదే గ్రామానికి చెందిన ఏర్పుల సాయమ్మ, అనంతమ్మ, పద్మలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయిస్తానని వారిని నమ్మించి రాములమ్మ ద్వారా ఏర్పుల సాయమ్మ రూ.20వేలు, అనంతమ్మ, 13వేలు, పద్మ 8వేలు, మున్నూర్‌సోమారం గ్రామానికి చెందిన హన్మంతు రూ.30వేలు శీనుకు అందజేశారు.
మోసం బయటపడిందిలా
ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు రాగా అసలు విషయం బయటపడింది. శీను అనే వ్యక్తి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని తామ వద్ద డబ్బులు తీసుకున్నాడని, మీరు మళ్లీ సర్వే ఎందుకు చేస్తున్నారని సాయమ్మ, అనంతమ్మ, పద్మలు అధికారులతో తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం నుంచి మంజూరవుతాయని, దళారులకు డబ్బులు ఇస్తే మంజూరుకావని ఈసర్వేతో అర్హులైన వారికి ఇళ్లు మంజూరవుతాయని అధికారులు చెప్పటంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు డబ్బులు వసూలు చేసిన రాములమ్మను పిలిచి విచారించగా శీను అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని తాను రూ.40వేలు ఇచ్చి మోసపోయానని చెప్పింది. మోసం చేసిన శీను ఫోన్‌నంబరును ఆమె పోలీసులకు అందజేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.