కలిసిరాని కాలం!
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:57 PM
ఎండనక, వాననక ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురు చూశారు. అప్పుడు కురవని వానలు అదును దాటాక వెంటాడాయి.
అనుకూలించని వాతావరణం
తలకిందులైన దిగుబడి అంచనాలు
తొలకరి కోసం తప్పని ఎదురుచూపు
సీజన్ ప్రారంభమైనా కురవని వర్షాలు
తర్వాత వదలని వానలతో దెబ్బతిన్న పంటలు
అధికంగా పాడైన పత్తి పంట
తేమ శాతంతో కొనుగోలుకు కొర్రీలు
ఏడాది పొడవునా రైతన్నకు నష్టాలు, కష్టాలు
ఎండనక, వాననక ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఈ ఏడాది కూడా కలిసి రాలేదు. తొలకరి వర్షాల కోసం రైతులు ఎదురు చూశారు. అప్పుడు కురవని వానలు అదును దాటాక వెంటాడాయి. దీంతో పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. తెగుళ్ల ఉధృతి కారణంగా దిగుబడి పడిపోయి గిట్టుబాటు ధర దక్కక రైతుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడ్డారు. ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది. దీంతో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 27, (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా తొలకరి వర్షాలు కురిస్తే జూన్ మొదటి వారం నుంచి జిల్లాలో ఆరుతడి, మెట్ట పంటల సాగు ఆరంభమవుతుంది. కానీ మూడోవారం వరకూ వాన జాడ లేకుండా పోయింది. అవసరం లేనప్పుడు వరుణుడు తన ప్రతాపాన్ని చూపించి ముఖం చాటేశాడు. దుక్కులు దున్ని విత్తిన విత్తనాలు ఎండలకు వాడిపోయాయి. మరోసారి విత్తులు విత్తే పరిస్థితి ఏర్పడింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 94.0మి.మీ. కాగా, 68.5మి.మీ. మాత్రమే కురిసింది. -27.1 మిల్లిమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో 146.6 మిల్లిమీటర్లు వర్షం కురువాల్సి ఉండగా 145.3 కురిసింది. ఆగస్టులో 146.0 మిల్లిమీటర్లకు గాను 34.5 కురిసింది. రైతులు పత్తి విత్తనాలను విత్తుకున్నా వర్షాలు రాకపోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. దీంతో వారిపై అదనపు భారం పడింది. పత్తి రైతుకు ఈసారి కూడా కష్టాలు తప్పలేదు. పెట్టుబడి, శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదు. పంట చేతికొచ్చాక సీసీఐ విధించిన ఆంక్షలకు ఆగమయ్యారు. 8-12 శాతం తేమ కలిగిన పత్తి మాత్రమే కొనుగోలు చేసేలా నిబంధనలతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కురిసిన వర్షాలు కూడా పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. పత్తి కాయ రంగు మారి దిగుబడి తగ్గింది. తేమ శాతంతో పాటు పత్తిలో కాయ వస్తోందని, రంగు మారిందని సీసీఐ అధికారులు సాకులు చెబుతూ క్వింటాలు పత్తికి మద్దతు ధరలో రూ.70 నుంచి రూ.100 వరకు తగ్గించేశారు.
కొన్నది కొంతే..
జిల్లాలో ఈ ఏడాది కూడా వరి ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగాయి. నిర్ధేశించుకున్న లక్ష్యం కొండంత ఉండగా.. సేకరించింది మాత్రం గోరంతే. దిగుబడి ఆశించిన బాగానే ఉన్నా సేకరణలో అధికారులు విఫలమయ్యారు. ఎక్కువ ధర కల్పించడం, కొనుగోళ్లలో షరతులు విధించక పోవడం, అమ్మిన వెంటనే డబ్బులు చెల్లించడం తదితర కారణాలతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకే ధాన్యం అమ్ముకున్నారు. సదుపాయాలు కల్పించకపోవడం, మిల్లర్లు తరుగు పేరిట దోపిడీకి పాల్పడటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావడానికి ఆసక్తి చూపలేదు. వ్యాపారులు పొలాల వద్దకు వెళ్లి పచ్చి వడ్లను కూడా కొన్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చుల భారం తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 40 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా.. ఇప్పటి వరకు 42 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,504 రైతుల నుంచి 7,310.920 టన్నులు ధాన్యాన్ని సేకరించారు. ఇందులో గ్రేడ్-ఏ రకం 7,285.720 టన్నులు, సాధారణ రకం, 25.200 టన్నులు కొనుగోలు చేశారు.
బిందు, తుంపర సేద్యానికి కరువైన ప్రోత్సాహం
జిల్లాలో బిందు, తుంపర సేద్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ఈ పథకం మూడేళ్ల్ల నుంచి అమలుకు నోచుకోవడం లేదు. బిందు సేద్యం ద్వారా సాగు గణనీయంగా పడిపోయింది. బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా పరికరాలు అందకపోవడంతో పంటలకు నీళ్లందించేందుకు రైతన్నలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో మూడేళ్ల కాలంలో సుమారు 4,500 మంది రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
నకిలీలతో నష్టాలు..
ప్రతీ ఏడాది రైతులకు నకిలీ బెడద తప్పడం లేదు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నకిలీ పత్తి విత్తనాలను ఇతర రాష్ర్టాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా రైతులకు అంటగడుతున్నారు. కొందరు రైతులు వీటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు.
రైతుకు ‘భరోసా’
జిల్లాలో యాసంగి 2024 సీజన్‌కు రైతు భరోసా పథకం కింద 3,25,217 మంది రైతుల ఖాతాల్లోకి రూ.343.11 కోట్లు జమ చేశారు. అలాగే ‘రైతు బీమా’ పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు వరకు 653 రైతుల మరణాలు నమోదు కాగా, మొత్తం రూ.32.65 కోట్లు రైతుల నామిని ఖాతాలలో జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించింది.