ఫోర్జరీ సంతకాలతో నిధుల దుర్వినియోగం
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:25 PM
ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేశారని, మినిట్స్ లేకుండా నిధులు డ్రా చేయడానికి అనుమతి ఇచ్చారని డ్వాక్రా సంఘాల మహిళలతో పాటు గ్రామస్తులు ఎస్‌బీఐ అధికారులను, సెర్ప్, అధికారులను నిలదీశారు.
-సెర్ప్, ఎస్‌బీఐ అధికారుల విచారణ
-అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
యాచారం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేశారని, మినిట్స్ లేకుండా నిధులు డ్రా చేయడానికి అనుమతి ఇచ్చారని డ్వాక్రా సంఘాల మహిళలతో పాటు గ్రామస్తులు ఎస్‌బీఐ అధికారులను, సెర్ప్, అధికారులను నిలదీశారు. సోమవారం యాచారం ఎస్‌బీఐ అధికారులు, సెర్ప్, అధికారులు ఉమ్మడిగా విచారణ చేపట్టడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోక వెళ్తే.. మల్కీజ్‌గూడ గ్రామానికి చెందిన బుక్ కీపర్ రాణి గ్రామంలోని ఇందిర, గులాబి, తదితర సంఘాల సభ్యుల తీర్మానంతో పాటు ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసి వాడుకుందని డ్వాక్రా సంఘాల సభ్యులతో పాటు గ్రామస్తులు ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసినట్లు గుర్తించి బ్యాంక్ మేనేజర్ ఝాన్సీరాణి, సెర్ప్ ఏపీఎం సుదర్శన్‌రెడ్డి గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టారు. సాయంత్రం వరకు జరిగిన విచారణలో రూ.3.12లక్షల నిధులు డ్రాచేసినట్లు విచారణలో తేల్చారు. ఆయా సంఘాల సభ్యుల సంతకాలను రాణి పోర్జరీ చేసి నిధులు కాజేశారని వారు వెల్లడించారు.
ఉద్రిక్త పరిస్థితుల్లో విచారణ
కాగా, మంగళవారం నుంచి ఒక్కో సంఘ సభ్యులను పిలిచి విచారణ చేస్తామని వారన్నారు. డ్రా చేసిన నిధులను తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేసేదాక ఆందోళన విరమించేది లేదని మహిళలు విచారణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతగా మారింది. కాగా రాణిపై యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశామని బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు. నిధులు దుర్వినియోగంపై ప్రశ్నిస్తే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి తనను మానసికంగా ఆమె వేధింపులకు గురి చేశారని బోడ ముత్యాలు అనే వ్యక్తి అధికారుల దృష్టికి తెచ్చారు. అధికారులు వాస్తవాలు విచారణ చేసి రాణి నుంచి నిదులు రాబట్టాలని గ్రామస్తులతో పాటు పొదుపు సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. కాగా విచారణ సందర్భంగా పరిస్థితి ఆదుపు తప్పుతుండడంతో యాచారం పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తేవడంతో విచారణ సజావుగా జరిగింది. గ్రామంలో సుమారు రూ.20లక్షల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు అనుమానిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.