శ్రీరామ నవమి ఉత్సవాలకు మైసిగండి రామాలయం ముస్తాబు
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:09 AM
ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఖ్యాతిగాంచిన కడ్తాల మండలం మైసిగండి రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.
16 నుంచి బ్రహ్మోత్సవాలు
మూడు రోజుల పాటు శ్రీ కోదండ రామచంద్రస్వామి ఉత్సవాలు
17న శ్రీ సీతారాముల పరిణయోత్సవం.. రథోత్సవం
కడ్తాల్, ఏప్రిల్ 13 : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఖ్యాతిగాంచిన కడ్తాల మండలం మైసిగండి రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రాష్ట్రంలో భద్రాచలం తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మైసిగండి రామాలయంలో సీతారాముల పరిణయోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏటా శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలకు మైసిగండి రామాలయాన్ని ముస్తాబు చేశారు. 3 రోజుల బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నల్గొండ తదితర జిల్లాల నుంచీ భక్తులు తరలి రానున్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగి అక్కన్న, మాదన్నల కాలం నుంచి మైసిగండి శివ, రామాలయం ప్రసిద్ధిగాంచింది. హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. పురాతన ఆలయాన్ని దివంగత ఆలయ ఫౌండర్ ట్రస్టీ రమావత్ పంతూ నాయక్, దాతలు, ప్రభుత్వం ప్రోత్సాహంతో పునరుద్ధరించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతం ఫౌండర్ ట్రస్టీగా రమావత్ పంతూ సతీమణి సిరోలి పంతూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఆలయ శిల్పకళ అందరినీ ఆకర్షిస్తోంది. ఆలయ ముందు భాగంలోని కోనేటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు, రోగాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కోనేరును రూ.కోటితో పునరుద్ధరించారు.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
మైసిగండి రామాలయం వద్ద శ్రీరామ నవమి ఉత్సవాలకు నిర్వాహకులు, ఎండోమెంట్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరిస్తున్నారు. దైవ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కల్వకుర్తి, ఆమనగల్లు, హైదరాబాద్‌ల నుంచి మైసిగండికి ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు నడపనున్నారు. మైసిగండి ఆలయంలో ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. కల్యాణం రోజు ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు. 16న విఘ్నేశ్వర పూజ, పుణ్యాఃవచనం, ధ్వజారోహనం, 17న శ్రీరామ నవమి సందర్భంగా మధ్యాహ్నం 12:30గంటలకు సీతారాముల కల్యాణ మహోత్సవం, సాయంత్రం రథోత్సవం, 18న చక్రతీర్థం, పుష్కర స్నానం కార్యక్రమాలుంటాయని ట్రస్టీ సిరోలి, ఈవో స్నేహలతల వివరించారు.