పేరు మారినా తీరుమారలే!
ABN , Publish Date - Dec 26 , 2024 | 11:33 PM
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం అభాసుపాలవుతోంది. దాదాపు వర్షాకాలం పూర్తయినప్పటికీ ఉమ్మడిజిల్లాలో లక్ష్యాల్లో సగం మేర కూడా చేరలేదు.
-వనమహోత్సవం లెక్కల తకరారు
-నాటకుండానే లక్ష్యం పూర్తంటూ గొప్పలు
-నాటిన కొన్ని చోట్లా జాడ లేని మొక్కలు
-అడవుల పెంపకం నిధుల ఖర్చులోనూ తీవ్ర నిర్లక్ష్యం
-మేడ్చల్ జిల్లాలో 62.67 శాతమే ఖర్చు
-అడవుల పెంపకంపై కరువైన శ్రద్ధ
-బల్దియాల్లో నిరుపయోగంగా గ్రీన్ బడ్జెట్
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం అభాసుపాలవుతోంది. దాదాపు వర్షాకాలం పూర్తయినప్పటికీ ఉమ్మడిజిల్లాలో లక్ష్యాల్లో సగం మేర కూడా చేరలేదు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవంగా పేరు మార్చింది. పేరు మార్చినా కార్యక్రమం తీరు మాత్రం మారలేదు. ఇందులో కీలకంగా ఉన్న ప్రభుత్వ శాఖలు లెక్కల గారడీతో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. లక్ష్యాలకు నాటిన మొక్కలకు పొంతన లేకున్నా లక్ష్యాలకు చేరువైనట్లు, పలుచోట్ల అధిగమించినట్లుగా గొప్పగా లెక్కల్లో చూపుతుండటం గమనార్హం.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం లక్ష్యాలను చేరడం లేదు. విస్తారంగా మొక్కలు నాటి వాటిని పెంచేందుకు కొన్ని దశాబ్ధాలుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 18 ప్రభుత ్వశాఖల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే పేరు మార్చినా కార్యక్రమం తీరు మాత్రం మారలేదు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం సజావుగా సాగడం లేదు. ఈ కార్యక్రమంలో
నాటకుండానే లెక్కల్లో..
నర్సరీల నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసినా ఇంత వరకు లక్షల సంఖ్యలో మొక్కలు నాటలేదు. కానీ లెక్కల్లో మాత్రం లక్ష్యాలను అధిగమించినట్లుగా, చేరువైనట్లుగా చూపిస్తున్నారు. మొక్కలు నాటకపోయినప్పటికీ ఆయా నర్సరీల నుంచి వివిధ శాఖలకు పంపిణీ చేసిన మొక్కలు మొత్తం ఆధారంగా లక్ష్యాలను అధిగమించినట్లు చూపిస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది వనమహోత్సవం కింద 82.49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 22.28 లక్షలు మాత్రమే నాటారు. మరో 54.43 లక్షల మొక్కలను నర్సరీల నుంచి వివిధ శాఖలకు పంపిణీ చేశారు. కానీ అవి ఇంకా నాటకుండానే లక్ష్యాలకు సమీపంలో ఉన్నట్లు చూపిస్తున్నారు.
విఫలమవుతున్న యంత్రాంగం
అలాగే మేడ్చల్ జిల్లాల్లో ఈ ఏడాది మొత్తం 63.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇందులో 29.66 లక్షల మొక్కలు మాత్రమే ఇప్పటి వరకు నాటారు. కానీ లెక్కల్లో 110.14శాతం లక్ష్యాలు సాధించినట్లు చూపుతున్నారు. మిగతా మొక్కలు నర్సరీల ద్వారా ఆయా శాఖలకు పంపిణీ చేసినట్లు చూపుతున్నారు. వాస్తవానికి నగర శివార్లలో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ నేపఽథ్యంలో విస్తారంగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి శివార్లలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని నిర్ణయించారు. కానీ ఏటా లక్ష్యాల మేర మొక్కలు నాటి పెంచడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. మొక్కల వృఽథాను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని జిల్లాల్లో లక్ష్యాలు తగ్గించింది. అయితే రంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను గతం కంటే పెంచింది. అయితే ఆ మేర ఫలితాలు సాధించడంలో అధికారయంత్రాంగం విఫలమవుతోంది.
కరువైన అధికారుల శ్రద్ధ
గడిచిన పదేళ్లలో అటవీ నిర్వహణ, ప్రణాళిక సంస్థ (కాంపా) ద్వారా రాష్ట్రంలో దాదాపు మూడువేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అడవుల పెంపకం కోసం ఏర్పాటు చేసిన ఈ నిధిని వినియోగించడంలో మూడు జిల్లాలు కూడా విఫలమయ్యాయి. మేడ్చల్ జిల్లా 62.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.41 శాతం, వికారాబాద్ జిల్లాలో 73.22 శాతం నిధులు వరకు ఖర్చు చేసింది. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ అడవుల పెంపకంపై అధికార యంత్రాంగం సరైన శ్రద్ధ తీసుకోవడం లేదని దీని ద్వారా అర్థమవుతోంది.
కనీసం 20 శాతం దాటలేదు
అలాగే మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కేటాయుస్తున్న గ్రీన్ బడ్జెట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. గతంలో దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని కూడా ప్రచురించింది. గ్రీన్ బడ్జెట్ కింద దండిగా నిధులు ఉన్నపట్పికీ వీటిని ఉపయోగించుకోవడం లేదు. ఈ నిధులతో పురపాలికల్లోని పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, స్కూళ్లు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. అలాగే వీటి సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్కూళ్లకు ఈ నిధుల్లో పది శాతం కచ్చితంగా ఖర్చుపెట్టాలనే నిబంధన పెట్టారు. నగర శివార్లలోని 23 పురపాలికల్లో గడిచిన నాలుగేళ్లలో గ్రీన్‌బడ్జెట్ కింద ప్రభుత్వం రూ.301.87 కోట్లు విడుదల చేసింది. అయితే ఇందులో సగం నిధులు కూడా ఇప్పటి వరకు పురపాలికలు ఖరు ్చపెట్టలేదు. కొన్ని పురపాలికలు కనీసం 20శాతం నిధులు కూడా ఖర్చుపెట్టకపోవడం గమనార్హం.
-----------------------
వనమహోత్సవం లక్ష్యాలు, నాటిన మొక్కలు(లక్షల్లో)
జిల్లా రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్
లక్ష్యం 82.49 63.70 40.48
నాటిన మొక్కలు 22.28 29.66 23.79
పంపిణీ చేసినా నాటనవి 54.43 34.12 7.75
మొత్తం 76.72 63.78 31.54
------------------------------