Share News

ఉలిక్కిపడిన నందిగామ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:29 AM

నందిగామ మండల కేంద్రంలోని అలెన్‌ హోమియో, హెర్బల్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో నిర్మాణ పనులు జరుగుతుండగా మొదటి అంతస్తులో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు.

ఉలిక్కిపడిన నందిగామ
మంటలు చెలరేగడంతో దగ్ధమవుతున్న పరిశ్రమ

అలెన్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

నాలుగు గంటల పాటు ఉత్కంఠ

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిన ఉద్యోగులు, కార్మికులు

భయాందోళనకు గురైన స్థానికులు

రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం

షాద్‌నగర్‌/నందిగామ, ఏప్రిల్‌ 26: నందిగామ మండల కేంద్రంలోని అలెన్‌ హోమియో, హెర్బల్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో నిర్మాణ పనులు జరుగుతుండగా మొదటి అంతస్తులో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. దాంతో నిప్పురవ్వలు ఎగిసి కిందపడటంతో.. హోమియో మాత్రలకు వినియోగించే ఆల్కహాల్‌ వంటి అనేక రసాయనాలపై పడ్డాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకోవడంతో కార్మికులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని అరుపులు, కేకలతో పరుగులు పెట్టారు. కాగ, అదే ప్రాంతంలో ఆల్కహాల్‌తో నిల్వ ఉంచిన పదిహేను బ్యారెల్స్‌కు కూడా నిప్పంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం దగ్ధమైంది. ఈక్రమంలో పరిశ్రమలోని నాలుగో అంతస్తులో కార్మికులు తప్పించుకునే అవకాశం లేక అక్కడే నిలబడిపోయారు. దాంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకి తీసుకురావడంతో మిగతా కార్మికులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

భయాందోళనలో నందిగామ వాసులు

మండల కేంద్రంలోని అలెన్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నందిగామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మండల కేంద్రంతో పాటు సుమారు 6 కిలోమీటర్ల వరకు దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదో భారీ అగ్ని ప్రమాదం జరిగిందన్న ఆలోచనతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. దాంతో గంటల తరబడి పాత జాతీయ దహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పరిశ్రమల్లో పని చేస్తున్న తమ వారికి ఏదైనా ప్రమాదం జరిగిందోనని తెలుసుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. పరిశ్రమలో పెద్దఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ప్రాణనష్టం జరగలేదని ఫైర్‌ సిబ్బంది తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో 75 మందికి పైగా కార్మికులు

అలెన్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు 75 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమలో మొదటి అంతస్తులో ప్రమాదం చోటు చేసుకోగానే.. వెంటనే పరిశ్రమ వెనుక భాగంలో ఉన్న మెట్లమీదుగా బయటకు చేరుకున్నారు. రెండో అంతస్తులో కూడా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా బయటకు వచ్చారు. నాలుగో అంతస్తులో ఉన్నవారిని మాత్రం సాయి చరణ్‌ అనే బాలుడు.. ఎలాంటి ప్రమాదం జరుగకుండా తాడు సాయంతో బయటకు తీసుకురావడం గమనార్హం. ప్రమాదంలో పరిశ్రమ నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకిన కె.లక్ష్మి నారాయణ స్వామి తీవ్రంగా గాయపడటంతో షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదం : డీసీపీ

పరిశ్రమలో వెల్డింగ్‌ పనుల వల్లనే ప్రమాదం సంభవించిందని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. షాద్‌నగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌కు చెందిన 7 ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. స్థానికంగా ఉన్న వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చాం.

సంఘటన దురదృష్టకరం : ఎమ్మెల్యే

నందిగామ మండల కేంద్రంలోని అలెన్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భయాందోళనకు గురైన కార్మికులకు భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 27 , 2024 | 12:29 AM