రోడ్డు ట్యాక్స్ చెల్లించని వాహనాలపై నజర్
ABN , First Publish Date - 2024-02-05T23:41:26+05:30 IST
జిల్లాలో త్రైమాసిక పన్ను చెల్లించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు నజర్ పెట్టారు.
155 వాహనాలు సీజ్, రూ.28.10 లక్షలు జరిమానా
జిల్లాలో కొనసాగుతున్న రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 5 : జిల్లాలో త్రైమాసిక పన్ను చెల్లించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు నజర్ పెట్టారు. కొన్ని కాంటాక్ట్ క్యారేజ్ బస్సులు, లారీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, కంపెనీ బస్సులు నాలుగు చక్రాల ట్రాలీలు తదితర వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, పొల్యుషన్, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. త్రైమాజిక పన్ను చెల్లించని వాహనాలను జప్తు చేస్తున్నారు. భారీగా పెనాల్టీ విధిస్తున్నారు. ఇప్పటి వరకు 155 వాహనాలు పన్నుల చెల్లించకుండా రోడ్డుపై నడుస్తున్నట్లు అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు. అంతే కాకుండా జరిమానా కూడా విధించారు. రూ.28.10 లక్షల జరిమానా విధించినట్టు అధికారులు చెప్పారు.
పన్ను చెల్లించకుంటే వాహనం సీజ్ : ప్రవీణ్‌రావు, జిల్లా రవాణాశాఖ అధికారి
వాహన యజమానులు తమ వాహనాల త్రైమాసిక పన్నులు వెంటనే చెల్లించాలి. ట్యాక్స్ చెల్లించకుండా వాహనం రోడ్డుపై తిప్పడం నిబంధనలకు విరుద్ధం. ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్‌చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నాం. నామినల్ పెనాల్టీతో ట్యాక్స్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాం.