అధికారులు పనితీరు మార్చుకోవాలి
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:51 PM
అధికారులు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : కలెక్టర్
రంగారెడ్డి అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : అధికారులు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారుల పనితీరు మార్చుకోవాలన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు ఆలస్యంగా హాజరు కావడంపై సీరియస్ అయ్యారు. సమయ పాలన పాటించాలన్నారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే ఊరుకునేది లేదన్నారు. ఫీల్డులో వారంలో మూడు రోజులు కచ్చితంగా వెళ్లి కింది స్థాయిలో శాఖ పనితీరును పరిశీలించాలన్నారు. ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ అంశాలకు సంబంధించి 41 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ ప్రతీమాసింగ్, డీఆర్వో సంగీత, ఏవో సునీల్, అధికారులు పాల్గొన్నారు.