ఫార్మాసిటీని రద్దు చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:48 PM
ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని, తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని మళ్లీ ఇప్పుడు దానిని తేవడం దారుణమని యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
నాడు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు తెరపైకి తేవడం దారుణం
నమ్ముకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచింది
ఎనిమిదేళ్లుగా నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించలేదు
మేడిపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి రైతుల ఆందోళన
సీఎంకు పోస్టుకార్డులు రాసిన రైతులు
యాచారం, సెప్టెంబరు 11 : ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని, తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తామని మళ్లీ ఇప్పుడు దానిని తేవడం దారుణమని యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మాట ఇచ్చి తీరా అధికారంలోకి రాగానే ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం పూనుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. తక్షణమే ఫార్మాసిటీని రద్దు చేసి ఇక్కడి రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మేడిపల్లిలో రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము నమ్ముకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమని నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలో ఎలాంటి పరిశ్రమలూ ఏర్పాటు చేయకుండా తమకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించి రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ తెస్తే తాము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపిస్తే నేడు తమకు తీవ్ర అన్యాయం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేయడం ఖాయమని ఆందోళన కారులు తేల్చి చెప్పారు. కొందరు అధికారులు రైతులకు ఫోన్‌లు చేసి భూమి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేక పోతుందని రైతులు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాలలో ఫార్మాసిటీ బాదిత రైతులను ఆదుకునేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని రైతులు చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. కాగా ఫార్మాసిటీ రద్దు చేయాలని పలువురు రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డులు పంపారు.