Share News

పేదల బియ్యం పక్కదారి

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:57 PM

ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యాచారం మండల పరిధిలోని గ్రామాల్లో రేనషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు.

పేదల బియ్యం పక్కదారి
యాచారం పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం(ఫైల్‌)

మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి బస్తాల్లో ప్యాకింగ్‌

సన్నబియ్యమని అమ్మకాలు

సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

యాచారం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి యాచారం మండల పరిధిలోని గ్రామాల్లో రేనషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో బియ్యానికి రూ.10 నుంచి రూ.15 వరకు చెల్లించి వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ తతంగమంతా రాత్రివేళలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది. కడ్తాల్‌ మండలంలోని పల్లెచెల్క తండావాసులు, ఆమనగల్లు, నగరంలోని పాతబస్తీకి చెందిన కొందరు వాహనాల్లో యాచారం మండలంలోని గ్రామాలకు వచ్చి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వీటిని నగరంలోని చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్‌, నల్గొండ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేయించి ఆకర్శణీయమైన బస్తాల్లో ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఇలా ప్యాకింగ్‌ చేసినవి సన్నబియ్యం అని జనాలను విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు సేకరించిన రేషన్‌ బియ్యాన్ని కోళ్లఫాంలలో అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు సమాచారం.

మండలంలో 26 రేషన్‌ దుకాణాలు

యాచారం మండలంలో 26 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 441 అంత్యోదయ కార్డులకు 15,435కిలోల రేషన్‌ బియ్యం, 12,950 ఆహార భద్రతా కార్డులకు గాను 25,4040కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ బియ్యాన్ని మండలంలో 65శాతం మంది మాత్రమే వండుకుంటున్నారు. మిగతావారు బయట అమ్ముకుంటున్నారు. రేషన్‌ బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, గత ఏడాది మూడు కేసులు నమోదు చేసి 15 క్వింటాళ్లు, ఈ ఏడాది 16 కేసులు నమోదు చేసి 80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని యాచారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తే చర్యలు

రేషన్‌ బియ్యం క్రయవిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. బియ్యం తరలించే వాహనాలనూ సీజ్‌ చేస్తాం. ఈఏడాది ఇప్పటికే 80క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులకు అప్పగించాం.

- ఏ.నర్సింహారావు, యాచారం సీఐ

Updated Date - Dec 02 , 2024 | 11:57 PM