Share News

కొనుగోళ్లకు రెడీ

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:54 PM

పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి పండగ తర్వాత సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

కొనుగోళ్లకు రెడీ

పత్తి కొనేందుకు సీసీఐ ఆధ్వర్యంలో 14 కేంద్రాలు

1.05 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణే లక్ష్యం

ఏర్పాట్లు చేస్తున్న మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులు

దీపావళి పండగ తర్వాత కొనుగోళ్లు ప్రారంభం

రైతుల్లో గుబులు పుట్టిస్తున్న తేమశాతం

ఎనిమిది శాతం కంటే తక్కువగా ఉంటేనే మద్దతు ధర

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పత్తి కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి పండగ తర్వాత సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రాల వద్ద రైతుల కోసం అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్‌లో తాగునీటితో పాటు రాత్రివేళలో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ఈ సారి 1,76,174 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తిని సాగు చేశారు. పంట సేకరణకు జిల్లావ్యాప్తంగా 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అత్యధికంగా షాద్‌నగర్‌లోనే 11, ఆమగనల్లులో 3 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది 1,27,786 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కొనుగోలు కేంద్రాల్లో 40 వేల మెట్రిక్‌ టన్నుల పత్తిని సేకరించారు. గత ఏడాది కంటే ఈ సారి సాగు విస్తీర్ణం 48,388 ఎకకాల్లో అధికమైంది. 1.05 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా పత్తి సాగు చేసిన రైతులు పత్తి తీసేందుకు సిద్ధమవుతున్నారు. కూలీల కొరత రాకుండా ముందుగానే ఇతర మండలం, గ్రామం, జిల్లాల వారిని రప్పిస్తున్నారు.

టోకెన్‌ విధానంపై కసరత్తు

కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్‌ విధానం అమలుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా టోకెన్‌ విధానం అమలు చేయాలా? వద్దా ? అని మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే అమలు చేయాల్సి వస్తే ఎన్ని టోకెన్లు ఇవ్వాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఒక్కో టోకెన్‌పై ఎన్ని క్వింటాళ్లను విక్రయించవచ్చు అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. అదేవిధంగా టోకెన్ల కోసం రైతులు ముందస్తుగా కేంద్రాలకు రావాలా? ఆయా మండల వ్యవసాయాధికారుల వద్ద తీసుకోవాలా? తదితర వాటిపై సమీక్షిస్తున్నారు.

నాణ్యత ఉంటేనే మద్దతు ధర

పత్తి పంటకు మద్దతు ధర పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాలనే నిబంధన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పంటకు మద్దతు ధర రూ.7,521 (లాంగ్‌ స్టేపుల్‌), రూ.7,121 (మీడియం స్టేపుల్‌)గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తేమశాతం 8 కంటే తక్కువగా ఉంటేనే మద్దతు ధర ఇస్తామని సీసీఐ అధికారులు తెలిపారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రతీ ఒక శాతానికి రూ. 58.25 చొప్పున ధర తగ్గుతుందని పేర్కొంటున్నారు. తేమశాతం 12 కంటే ఎక్కువగా ఉన్న పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉండదంటున్నారు. అయితే ప్రస్తుతం వాతారణంలో మార్పులతో తేమశాతం 16 నుంచి 25 వరకూ వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. తేమశాతం నిబంధన కారణంగా తక్కువ ధర వచ్చి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. తేమశాతం పాటించకుండా పత్తి రంగు, నాణ్యతా, శుభ్రత ప్రమాణాల ద్వారానే ధర కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

దీపావళి తర్వాత కేంద్రాలను ప్రారంభిస్తాం

జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలను దీపావళి తర్వాత ప్రారంభిస్తాం. అప్పట్లోగా దళారులకు పంటను విక్రయించి నష్టపోవద్దు. సీసీఐ కేంద్రాల్లో పత్తి నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటే మద్దతు ధర ఇస్తారు. ఇంటి వద్దనే పంటను ఆరబెట్టుకుని తీసుకురావాలి. రైతు వెంట ఆధార్‌కార్డు, పట్టా పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

మహమ్మద్‌ రియాజ్‌, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి

తేమ కొర్రీలు పెట్టొద్దు

ఐదెకరాల్లో పత్తి వేశాను. పంట చేతికొచ్చింది. వర్షాలతో పంట చేనులో నీరు నిలిచింది. ఇప్పుడు పత్తి తీసేందుకు రాదు. పొలంలో నీరు ఆరాక పత్తి తీయిస్త. వారం నుంచి మంచు ఎక్కువగా కురుస్తుంది. దీనివల్ల తేమ శాతం పెరిగేందుకు అవకాశం ఉంది. తేమ కొర్రీలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి.

మాధవరెడ్డి, ఎలక్కగూడ గ్రామం, చౌదరిగూడ మండలం

సీసీఐకి పత్తి అమ్మే రైతుల కోసం..

- సీసీఐ తేమ శాతం 8-12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారు. తేమ శాతం 12 శాతం కంటే ఎక్కువ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయరు.

- నాణ్యత లేని, రంగు మారిన, వర్షానికి తడిసినపత్తిని సీసీఐ కొనుగోలు చేయదు.

- మైక్రోనీర్‌ విలువ పరిధి బీబీ వెరైటీకి 3.5 - 4.3 బిబి ఎస్పీఎల్‌ 3.6-4.8 ఎంఈసీహెచ్‌ వెరైటీకి-3.5-4.7 పరిధి కంటే ఎక్కువ, తక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు ప్రతీ క్వింటాకు రూ.25 తగ్గిస్తారు.

- రైతులు తమ పత్తిని లూజు రూపంలో మాత్రమే తీసుకురావాలి.

- పత్తి రైతులందరూ సంబంధిత ఏపీఎంసీలో ఆన్‌లైన్‌ ఆధార్‌ ప్రమాణీకరణ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

- రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఆధార్‌ ప్రమాణీకరణ, రిజిస్ర్టేషన్‌ పూర్తి చేయబడిన పత్తి రైతుల వద్ద మాత్రమే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తారు.

- పత్తి కొనుగోలు డబ్బులు ఎబీపీఎ్‌స/ఏఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ఆధార్‌ లింక్‌ చేయబడిన బ్యాంకు ఖాతాలోకి మాత్రమే జమ చేస్తుంది. ఇది ఆన్‌లైన్‌ ఇ-పేమెంట్‌ సిస్టమ్‌ ఉంటుంది. పత్తి రైతులందరూ తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింకు, కేవైసీ చేసుకోవాలి.

Updated Date - Oct 23 , 2024 | 11:57 PM