Share News

ఎండలతో నిర్మానుష్యంగా రోడ్లు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:03 AM

వేసవి ఎండలు వారం రోజులుగా దంచికొడుతున్నాయి. భానుడి తాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.

ఎండలతో నిర్మానుష్యంగా రోడ్లు
కులకచర్లలో ఎండ వేడిమికి నిర్మానుష్యంగా మారిన ప్రధాన రోడ్డు

కులకచర్ల, ఏప్రిల్‌ 7: వేసవి ఎండలు వారం రోజులుగా దంచికొడుతున్నాయి. భానుడి తాపంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. కులకచర్ల మండలంలో రికార్డు స్థాయిలో 42 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండ వేడిమి రాత్రి 7గంటలు దాటిని తగ్గడం లేదు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు పగటి పూట నిర్మానుష్యంగా మారుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిమితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖాలకు, తలకు రక్షణ కవచాలతో ప్రయాణికులు బయటకు వస్తున్నారు. మరో వైపు ఎండలతో గిరాకీలు తగ్గిపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. వివిధ అవసరాలకు కులకచర్లకు వచ్చిన ప్రజలు చౌరస్తాలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కూల్‌డ్రింక్స్‌, పండ్లరసాలు సేవించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:03 AM