సర్వీస్ రోడ్లు స్వాహా..
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:00 PM
ఘట్‌కేసర్ పరిధిలోని వరంగల్ హైవే నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నా.. నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. రోడ్డుపై వాహనదారులకు కనిపించాల్సిన సూచికబోర్డులు చెట్లకొమ్మల నడుమ దాగుడుమూతలు ఆడుతున్నాయి.
-అస్తవ్యస్తంగా వరంగల్ హైవే
-ఘట్‌కేసర్ పరిధిలో అన్నీ సమస్యలే
-చెట్ల కొమ్మల మధ్యన సూచికబోర్డులు
-ఎరిమల్లేవాగు పొంగితే రాకపోకలు బంద్
-టోల్ వసూలు చేస్తున్నా.. పట్టని నిర్వహణ
-ఆందోళనలో వాహనదారులు
-పట్టించుకోని జాతీయ రహదారుల శాఖ
ఘట్‌కేసర్ పరిధిలోని వరంగల్ హైవే నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ముక్కుపిండి టోల్ వసూలు చేస్తున్నా.. నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. రోడ్డుపై వాహనదారులకు కనిపించాల్సిన సూచికబోర్డులు చెట్లకొమ్మల నడుమ దాగుడుమూతలు ఆడుతున్నాయి. సర్వీస్ రోడ్ల పరిస్థితి సరేసరి. ఇష్టారీతిన ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, ఎక్కడపడితే అక్కడ మట్టికుప్పలు పోయడంతో వాహనదారులు ఆ రోడ్డులో వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. ఎరిమల్లే వాగు పొంగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇలా వరంగల్ హైవే అధ్వానంగా మారినా అఽధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఘట్‌కేసర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): వాహనదారుల భద్రతను జాతీయ రహదారుల శాఖ అధికారులు గాలికొదిలేశారు. ఘట్‌కేసర్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి స్థలం యథేచ్ఛగా ఆక్రమలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఘట్‌కేసర్ నుంచి మాధవరెడ్డి రైల్వేవంతెన వరకు రోడ్డు ఇరుకుగా ఉండటంతో 2011లో బైపాస్ రోడ్డును నిర్మించారు. ఈరోడ్డుపై రాకపోకలు సాగించినందుకు టోల్ సైతం వసూలు చేస్తున్నారు. నాలుగు లైన్ల రోడ్డుతోపాటు ఇరువైపుల సర్వీసు రోడ్లను సైతం నిర్మించారు. కానీ, ఆ సర్వీస్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది బైపాస్ రోడ్డుకు ఇరువైపుల నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల మట్టి కుప్పలను రోడ్డుపై పోయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే ఘట్‌కేసర్‌లోని ఎరిమల్లే వాగుపై నిర్మించిన సర్వీసు రోడ్డుతోనూ అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ రోడ్డుఎత్తు తక్కువగా ఉండటంతో వాగు పొంగగితే ప్రవహిస్తే సర్వీసు రోడ్డునుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతంలో కురిసిన వర్షాలకు సర్వీసు రోడ్డు రేలింగ్ పూర్తిగా దెబ్బతిన్నది. ఏళ్లు గడుస్తున్నా కనీస మరమ్మతులు కరువయ్యాయి.
కనిపించని సూచిక బోర్డులు
ఘట్‌కేసర్‌లోని హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో రోడ్డు మలుపులు, పలు రకాలు సూచిక బోర్డులు చెట్ల కొమ్మల్లో కలిసి పోయాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారితోపాటు సర్వీసు రోడ్ల నిర్వాహణపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై రాపోకలు సాగించినందుకుగాను టోల్ చార్జీలు వసులు చేస్తున్నా కనీస నిర్వహణ పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలను తొలగిస్తూ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి సర్వీసు రోడ్లకు మధ్యన మొక్కలను కుప్పలుకుప్పలుగా నాటించిన అధికారులు వాటి సంరక్షణను మరిచిపోయారు. ప్రధానంగా ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డులో ఎవరికి అవసరమైన చోట వారు మొక్కలను తొలగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
తరచూ ప్రమాదాలు
ఘట్‌కేసర్‌లోని బైపాస్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎరిమల్లెవాగు వద్ద ఎత్తు తక్కువగా ఉండటంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగువైపు రేలింగ్ కొట్టుకు పోయింది. ఇప్పటివరకు మరమ్మతులలు లేవు. టోల్ వసూలుపై ఉన్న శ్రద్ధ వాహనదారులకు సౌకర్యాలు కల్పించడంలో లేదు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలి.
-మీసాల సుధాకర్‌రావు, ఘట్‌కేసర్
&&&&&&&&&&&&&&&&&&&
అధికారులు చర్యలు చేపట్టాలి
హైవేకి ఇరువైపుల మొక్కల పెంపకం కోసం గత ప్రభుత్వం భారీగా హెచ్‌ఎండీఏ నిధులను ఖర్చు చేసింది. ఉపయోగపడే మొక్కలను కాకుండా త్వరగా పెరిగే సాధారణ మొక్కలను నాటారు. అవి ఏపుగా పెరిగితే కనీసం కొమ్మలను కూడా తొలగించడం లేదు. దాంతో సూచిక బోర్డులు కనిపించకుండా పోయాయి. అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి.
- ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఘట్ కేసర్