Share News

కూలీల కొరత.. పొలంలోనే పత్తి

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:53 PM

అకాల వర్షాలతో దెబ్బతిని కాస్త దిగుబడి వచ్చిన పత్తి పంటకు కూలీల కొరత శాపంగా మారింది. కూలీల కొరత కారణంగా రైతులు పత్తి పంటను పొలాల్లోనే వదిలేసిన దుస్థితి నెలకొంది.

కూలీల కొరత.. పొలంలోనే పత్తి
కూలీల కొరతతో పొలంలో వదిలేసిన పత్తి పంట

కిలో పత్తి తీసేందుకు

రూ.15 డిమాండ్‌

భారీగా తగ్గిన పంట దిగుబడి

పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతుల ఆవేదన

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో పరిస్థితి

మర్పల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో దెబ్బతిని కాస్త దిగుబడి వచ్చిన పత్తి పంటకు కూలీల కొరత శాపంగా మారింది. కూలీల కొరత కారణంగా రైతులు పత్తి పంటను పొలాల్లోనే వదిలేసిన దుస్థితి నెలకొంది. మర్పల్లి మండలంలో 3వేల హెక్టార్‌లకు పైగా పత్తిపంటను రైతులు సాగు చేశారు. ఎకరానికి దాదాపు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టగా పంటసాగు చేసినప్పటి నుంచి అకాల వర్షాలతో పంట ఎర్రబారింది. మొక్కకు దాదాపు 50 నుంచి 100 కాయలు కాయాల్సి ఉండగా 30లోపు పత్తికాయలు కాశాయని రైతులు వాపోయారు. ప్రస్తుతం పత్తిపంట చేతికి రావడంతో కూలీల కొరతతో ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోపత్తిని తీసేందుకు రూ.11నుంచి రూ.15వరకు కూలీ అడుగుతున్నారని, ఇలా అయితే తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. కనీసం పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్‌లో పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందనే సాకుతో రూ.7వేలకు క్వింటాలు ధర పలకడం లేదని రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది పత్తి రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:53 PM