Share News

సజావుగా గ్రూప్‌-1 మెయిన్స్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:45 PM

జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మొదటి రోజు సజావుగా ముగిసింది. రెండు రూట్‌లలో ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో 5854 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 2157 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.

సజావుగా గ్రూప్‌-1 మెయిన్స్‌
భాస్కర ఇంజనీరింగ్‌ కళాశాలలో కలెక్టర్‌ శశాంక్‌

మొదటి రోజు 5,854 మంది హాజరు

2,157 మంది గైర్హాజరు

దివ్యాంగులకు అదనపు సమయం కేటాయింపు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌

రంగారెడ్డి అర్బన్‌/ఇబ్రహీంపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మొదటి రోజు సజావుగా ముగిసింది. రెండు రూట్‌లలో ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో 5854 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 2157 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 1.30 గంటలకు అధికారులు గేట్లు మూసివేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు బందోస్తులో పాల్గొన్నారు. ఎగ్జామ్‌ రూమ్‌, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పరిధిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష సజావుగా సాగింది. అభ్యర్థి శెట్టి అనిత కాలి గాయంతో గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రానికి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బందోబస్తులో ఉన్న పోలీసులు కుర్చీలో కూర్చోబెట్టి కేంద్రంలోకి మోసుకెళ్లారు.

సెంటర్లను సందర్శించిన కలెక్టర్‌

మొయినాబాద్‌ రూరల్‌ : గ్రూపు-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ శశాంక తెలిపారు. మొయినాబాద్‌ మండల పరిధి కేజీరెడ్డి (ఏ,బీ సెంటర్లు), భాస్కర, విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజీలలో ఏర్పాటు చేసిన సెంటర్లను అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తోపాటు కలెక్టర్‌ సందర్శించారు. ఏసీపీ కిషన్‌, సీఐ పవన్‌కుమార్‌ రెడ్డి, ఎస్సై నర్సింహులు ఉన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:45 PM