Share News

కొడంగల్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:40 PM

కొడంగల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ.గుల్షన్‌ అన్నారు.

కొడంగల్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్‌

కొడంగల్‌ రూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ.గుల్షన్‌ అన్నారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మట్లాడుతూ.. కొడంగల్‌ ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా కొడంగల్‌ ఎందుకు అభివృద్ధి చెందడంలేదని ఆరోపించారు. కొడంగల్‌ అంబేడ్కర్‌ చౌరస్తా ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. చౌరస్తాను విస్తరించేందుకు అధికారులు పరిశీలించినా ఇప్పటి వరకు పనులు చేపట్టలేదన్నారు. అదేవిధంగా వినాయక చౌరస్తా పరిస్థితి కూడా అధ్వానంగా మారిందన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ముందు కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామని చెప్పి నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇక శిథిలావస్థకు చేరిన షాదీఖానా (ఉర్దూ ఘర్‌) దుస్థితి గురించి ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, సైడ్‌ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వేసవిలో మరిన్ని ఇబ్బందులు తప్పవన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం నాయకులు ఎండీ.సర్తాజ్‌హుసేన్‌, సయ్యద్‌ ముస్తఫా, షేక్‌ ఆబీద్‌, షేక్‌ రోమాన్‌, ఎండీ.అజహర్‌, ఎండీ ముర్తజా, ఎండీ ఆమేర్‌ హుసేన్‌, సయ్యద్‌ అర్షద్‌ అలీఖాద్రీ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:40 PM