Share News

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి

ABN , Publish Date - Nov 29 , 2024 | 10:54 PM

విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శంషాబాద్‌ ఒయాసిస్‌ పాఠశాలలో 52వ జిల్లా స్థాయి పాఠశాల వైజ్ఞానిక, 12వ ఇన్‌స్పైర్‌ ప్రాజెక్టుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 400 పాఠశాలలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాపట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రయోగ పద్ధతిని అలవర్చుకొని మేధావులుగా ఎదగాలని సూచించారు. విద్యారంగంలో జిల్లా మార్గదర్శకంగా నిలవాలని కావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత వేల సంవత్సరాల నిరంతర నిర్విరామ కృషితో సాధ్యపడిందన్నారు. ఇలాంటి లక్షణాలను విద్యార్థులు పుణికిపుచ్చుకోవాలన్నారు. శాసనమండలి సభ్యుడు ఏవీఎన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచనా శక్తిని పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ సైన్స్‌ అంటేనే తెలుసుకోవడమని, ఒక చిన్న ప్రశ్న నుంచే ఎంతో మేథోమదనం జరిగి కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఇలాంటి విశ్లేషణాత్మకతను బాల్యదశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందన్నారు. డీఈఓ సుశీందర్‌రావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో గణిత, వైజ్ఞానిక, పర్యావరణ ప్రాజెక్టులు ఇప్పటి వరకు 365 నమోదయ్యాయని, 82 ఇన్‌స్సైర్‌ ప్రదర్శనలు ప్రదర్శించినట్లు తెలిపారు. ఓయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సి పాఠశాల ప్రిన్సిపాల్‌ యం.ఉమాదేవి మాట్లాడుతూ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు తమ పాఠశాలను ఎంపిక చేయడం పట్ల విద్యాశాఖకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం ముఖ్య అతిథులు ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించి ప్రాజెక్టులను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి వై.శ్రీనివా్‌సరావు, ఎంఈవోలు కిషన్‌నాయక్‌, క్రిష్ణయ్య, గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 10:54 PM