Share News

లక్ష్యం 100శాతం

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:28 PM

పదో తరగతి విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.

లక్ష్యం 100శాతం
స్టడీ ఆవర్‌లో పదో తరగతి విద్యార్థులు

-పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక ప్రణాళిక

-ఉదయం, సాయంత్రం స్పెషల్‌ తరగతలు

-పాఠ్యాంశాల రివిజన్‌తో సందేహాలు నివృత్తి

-ఏ, బీ, సీ గ్రూప్‌లుగా విభజించి పరిశీనల

పదో తరగతి విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉత్తీర్ణత శాతం పెంచడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కొరత ఉన్న పాఠశాలలకు కొత్త టీచర్లు రావడంతో పూర్తి స్థాయిలో విద్యాబోధన సాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠాలను రివిజన్‌ చేస్తూ.. అర్థం కానీ పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు.

చౌదరిగూడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని పాఠశాలల్లో నవంబరు 1 నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే పూర్తి చేసిన సిలబ్‌సను రివిజన్‌ చేస్తూ వెనుకబడిన వారు అన్ని అంశాలపై పట్టు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొందుర్గు మండలంలో కొందుర్గు, మూట్పుర్‌, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలంలో పెద్ద ఎల్కిచర్ల, ఎదిర, ఇంద్రానగర్‌, లాల్‌పహాడ్‌ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలున్నాయి. ఉమ్మడి మండలంలో మొత్తం 589 మంది విద్యార్థులు 2024-25 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మండలంలో మొత్తం 8 ఉన్నత పాఠశాల ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో వచ్చిన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాదిలో మంచి ఫలితాలు సాధించాలనే తపనతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఫలితాలపై ప్రత్యేక కార్యాచరణ

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అదించడంతో పాటు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:00 నుంచి 5:00 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఏ రోజు ఏ సబ్జెక్టులపై తరగతులు నిర్వహించాలనే విషయంపై స్పష్టమైన టైం టేబుల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఉదయం ఒక ఉపాధ్యాయుడు, సాయంత్రం మరొకరు వారికి సబ్జెక్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ గ్రూపులగా విభజించి సులువుగా పాఠ్యంశాలు అర్థమయ్యేలా విద్యను బోధిస్తున్నారు.

తప్పుల సవరణకు రోజువారీ పరీక్షలు..

విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో చేసే తప్పులను గుర్తించేందుకు వారికి అవగాహన కల్పించేందుకు రోజువారీ పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. సబ్జెక్ట్‌ వారీగా పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు చేసిన తప్పులను వ్యక్తిగతంగా వివరించి, పునరావృతం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు నిత్యం తెల్లవారుజామునే ఫోన్‌కాల్‌తో నిద్రలేపి చదివేలా ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా కూడా సందేశాలను నివృత్తి చేస్తున్నారు.

వ్యక్తిగత శ్రద్ధతో ముందుకు..

తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకే పరిమితమవుతారు. దాంతో విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపే అవకాశం ఉండదు. దీంతో చురుకైన విద్యార్థులు మాత్రమే ముందంజ వేస్తారు. వెనుకబడిన విద్యార్థులు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేక తరగతులు వరంగా మారాయనడంలో సందేహం లేదు. పిల్లల వ్యక్తిగత సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలను చదువు కోవడానికి అవకాశం కల్పిస్తారు. ప్రధానంగా గణితం, ఆంగ్లం, భౌతిక, జీవశాస్త్రాల్లో విద్యార్థులకు ఎక్కువ సందేశాలు వస్తున్నాయని, వాటిని అయా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకొంటున్నారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలుపుతున్నారు.

------------

గణితంపై దృష్టి పెట్టా..

గణితంలో నూటికి నూరు మార్కులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నా. రేఖీయ సమీకరణాలు, త్రికోణమితి, సిద్ధాంతాలు, శ్రేణులు, బహుపదులకు సంబంధించిన లెక్కలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాను.

-మనోవిగ్నేష్‌, విద్యార్థి, జెడ్పీహెచ్‌ ఎస్‌, చౌదరిగూడ

------------

తికమకపెడుతున్న భౌతిక శాస్త్రం

భౌతిక శాస్త్రంలో కొన్ని కొన్ని పాఠ్యాంశాలు తికమక పెడుతున్నాయి. ప్రత్యేక తరగతుల్లో నాకున్న అన్ని సందేహాలను నివృత్తి చేసుకుంటున్నా.. బాగా కష్టపడి పది ఫలితాల్లో మంచి గ్రేడ్‌ మార్కులు సాధిస్తా.

-వైష్ణవి, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల, లాల్‌పహాడ్‌

--------------

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం

గణితంలో పలు అధ్యాయాల్లోని కఠినమైన లెక్కలను విద్యార్థులు సులభంగా చేసేలా ప్రత్యేక తరగతుల్లో మెలకువలు నేర్పుతున్నాం. ప్రత్యేక తరగతుల్లో వారు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న అంశాలపై అవగాహన కల్పిస్తు బోధన చేస్తున్నాం. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

-వాణి, గణితశాస్తం, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్‌ఎ్‌స, చౌదరిగూడ.

Updated Date - Nov 18 , 2024 | 11:28 PM