Share News

కులవృత్తుల నుంచి కార్పొరేట్‌ రంగాన్ని తొలగించాలి

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM

కుల వృత్తుల్లో కార్పొరేట్‌ రంగాన్ని నిర్మూలించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కోరారు.

కులవృత్తుల నుంచి కార్పొరేట్‌ రంగాన్ని తొలగించాలి
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

షాద్‌నగర్‌, అక్టోబరు 1: కుల వృత్తుల్లో కార్పొరేట్‌ రంగాన్ని నిర్మూలించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కోరారు. బీసీ, ఎంబీసీల జీవనోపాధికి ఎంఎ్‌సఎంఈ 2024 పాలసీ సవరణలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీల ఆర్థిక స్వాలంబనకు ప్రణాళిక రూపొందించి ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. ఫెడరేషన్లు నామ్‌కే వాస్తేగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అఽధ్యక్షతన నిర్వహించిన ఎంఎ్‌సఈఎం సమావేశానికి ఎమ్మెల్యేను ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తుల్లోకి కార్పొరేట్‌ రంగం రావడంతో బీసీల బతుకులు రోడ్డున పడుతున్నాయన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడం, వాటిని ఇతర అవసరాలకు దారిమల్లిచండం తప్ప పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. క్షౌరశాలలు, రజక వృత్తిలోకి కూడా కార్పొరేట్‌ కంపెనీలు రావడంతో నాయీ బ్రాహ్మణులు, రజకులు రోడ్డున పడ్డారన్నారు. పేదల పథకాలు, నిధులను బ్యూరోక్రాట్లు కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతూ, పేదల బతుకులతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. వడ్డెర వృత్తిలోకి కూడా కార్పొరేట్‌ రంగానికి ఎలా అనుమతులిస్తున్నారని ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మూసీ మాస్టర్‌ ప్లాన్‌లో రజకులకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. కుల వృత్తులతో జీవిస్తున్న బీసీ, ఎంబీసీల బతుకులు ఆగమ్యగోచరంగానే మారాయాని, వారి సంక్షేమానికి కేటాయించిన నిధులను వారికే వెచ్చించాలని ఎమ్మెల్యే కోరారు.

Updated Date - Oct 01 , 2024 | 11:58 PM