వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:22 AM
గుర్తుతెలియని వ్యక్తులు ఓవ్యక్తిపై మారుణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని కుమ్మర్‌పల్లి చెరువు అలుగులో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ధారూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తులు ఓవ్యక్తిపై మారుణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని కుమ్మర్‌పల్లి చెరువు అలుగులో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమ్మర్‌పల్లి తండా సమీపంలోని భోజ్యనాయక్ తండాకు చెందిన వర్త్యపండరి(34) 2009లో దివ్యను వివాహం చేసుకుని హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఉంటున్నాడు. లింగంపల్లిలో పార్కింగ్ సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడు తన స్వగ్రామమైన భోజ్యనాయక్ తండాకు వచ్చి పొలం పనులు చేసుకుని తిరిగి వెళ్లేవాడు. ఈనెల 22న శుక్రవారం ఉదయం 11.40గంటలకు దివ్యకు ఫోన్‌చేసి తాను భోజ్యనాయక్ తండాకు వెళ్లివస్తానని చెప్పి హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. ఆతర్వాత మధ్యాహ్నం 2.20గంటలకు భార్య ఫోన్ చేయగా తాను తండాకు వచ్చానని తర్వాత ఫోన్ చేస్తాననిచెప్పి పండరి ఫోన్‌కాల్ కట్‌చేశాడు. ఆ తర్వాత మధ్యాహ్నం కొంతమందితో కలిసి విందు చేసుకున్నాడు. వికారాబాద్ వెళ్లి తిరిగి శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో తండాకు వచ్చిన పండరి తన వదిన అనూష వద్దకు వెళ్లి తాను బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికిరాలేదు. శనివారం ఉదయం కుమ్మర్‌పల్లి చెరువు అలుగులో పండరి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి, ధారూరు సీఐ రఘురాం, ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్‌లు ఘటనాస్థలానికి చేరకుని పంచనామా నిర్వహించారు. విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పండరి ముఖం, తల, కాళ్లపై బలమైన గాయాలన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు పక్కాప్రణాళిక ప్రకారం శుక్రవారం రాత్రి దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య దివ్య, కుమారుడు వవన్ కుమార్ ఉన్నారు. భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు జాగిలంతో తనిఖీ
పండరి మృతదేహం వద్ద పోలీసు జాగిలంతో తనిఖీ చేయించారు. భోజ్యనాయక్ తండా సమీపంలోని సంజప్ప దరి వద్దకు జాగిలం పరుగుతీసింది. అక్కడ కొంతమంది మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి జాగిలం చెరువు వద్ద కలియతిరిగి రోడ్డుపైకి వచ్చి ఆగింది. హత్య చేసిన అనంతరం హంతకులు రోడ్డుపైకి వచ్చి వాహనంలో పరారైనట్లు అనుమానిస్తున్నారు.
విభిన్న కోణాల్లో అనుమానాలు
పండరి హత్యపై విభిన్న కోణాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోజ్యనాయక్ తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన వర్త్య పండరి గత సర్పంచ్ ఎన్నికల్లో కుమ్మర్‌పల్లి సర్పంచ్ స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు. ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఏవరైనా ప్లాన్‌ప్రకారం హత్య చేశారా? లేదా ఇతర వివాదాలతో ఈహత్య జరిగిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తండాలో, కుమ్మర్‌పల్లిలో అందరితో మంచిగా మెలిగే పండరి దారుణ హత్యకు గురికావటం తండావాసులను తీవ్ర భయాందోళనకు, దిగ్ర్బాంతికి గురిచేసింది. ఈహత్యపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.